చెరువులను నింపాలి.. చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

చెరువులను నింపాలి.. చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి ఉత్తమ్​
  • భారీ వర్షాలతో చెరువులు, కాల్వలకు 177 గండ్లు
  • వరద నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు
  • ప్రాజెక్టుల పరిస్థితిపై అధికారులతో రివ్యూ

హైదరాబాద్, వెలుగు: రిజర్వాయర్లలోకి భారీగా వరద వస్తున్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రాజెక్టులకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. చెరువులు నింపి.. చివరి ఆయకట్టు వరకు నీళ్లివ్వాలని సూచించారు. పంటల సాగును దృష్టిలో పెట్టుకుని నీటిని విడుదల చేయాలన్నారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. 

కృష్ణా, గోదావరి బేసిన్లలో వరద పోటెత్తుతున్నదని, అందుకు అనుగుణంగా ప్రాజెక్టులను ఆపరేట్ చేయాలని సూచించారు. భారీ వర్షాలతో ఇప్పటికే రాష్ట్రంలోని సగానికిపైగా చెరువులు నిండాయని, మిగితావి నింపాలని సూచించారు. జలసౌధలో ఈఎన్​సీలు, సీఈలు, ఎస్ఈలు, ఈఈలతో మంగళవారం ప్రాజెక్టుల వరద పరిస్థితిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. 

రాష్ట్రంలో 34,740 చెరువులుండగా.. అందులో ఇప్పటికే 12,023 చెరువులు పూర్తి స్థాయిలో నిండాయని, మరో 9,100 చెరువులు 75 నుంచి 100 శాతం నిండాయని పేర్కొన్నారు. చెరువుల్లో నీటికి కొరత లేదన్నారు. అయితే, అదే సమయంలో సర్​ప్లస్ వాటర్ విడుదల నిర్వహణలో కొంచెం ఒత్తిడి ఉందని తెలిపారు. భారీ వర్షాలతో చెరువులు, కాల్వలు, లిఫ్టులకు గండ్లు పడుతున్నాయని, ఇప్పటివరకు 177 సంఘటనలు జరిగాయని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. 

వరద నష్టంపై వెంటనే స్పందించాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలోని వివిధ చెరువులు, కాల్వలకు సంబంధించి 3500 రీ స్టోరేషన్ పనులు చేపట్టామన్నారు. ఆదిలాబాద్, ములుగు, మహబూబ్​నగర్, సూర్యాపేట జిల్లాల్లో అత్యధికంగా గండ్లు పడ్డాయని తెలిపారు. అన్నింటికీ శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలన్నారు.  వరద నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.  

పంటల క్యాలెండర్​ ప్రకారం నీళ్లివ్వాల్సిందే

పంటల క్యాలెండర్​ ప్రకారం రైతులకు సాగునీళ్లు ఇవ్వాల్సిందేనని అధికారులకు మంత్రి ఉత్తమ్​ ఆదేశాలు ఇచ్చారు. ఖరీఫ్​ సీజన్​కు 388 టీఎంసీల నీళ్లు అవసరమవుతాయని స్కివమ్​ కమిటీ మీటింగ్​లో నిర్ణయించారని గుర్తు చేశారు. చెరువులు పూర్తిగా నిండిన నేపథ్యంలో వాటి కింద ఆయకట్టుకూ సమయానుగుణంగా నీటిని విడుదల చేయాలని స్పష్టం చేశారు.

 గోదావరి బేసిన్​లో ప్రస్తుత వరదను ఒడిసిపట్టాలని, ఖరీఫ్​తో పాటు యాసంగికీ నీళ్లిచ్చేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. కడెం, ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుల నుంచి నీటి నిర్వహణను సమర్థవంతంగా చేయాలన్నారు. బుధవారం తాను శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్​, మిడ్​మానేరు ప్రాజెక్టులను పరిశీలిస్తానన్నారు. 

లోతట్టు ప్రాంతాల్లో వరద నియంత్రణతో పాటు రైతులకు నీళ్లిచ్చే అంశాల్లో రాష్ట్రం సవాళ్లను ఎదుర్కొంటున్నదని ఆయన పేర్కొన్నారు. ఆ రెండు అంశాలనూ సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇరిగేషన్​, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్​ బొజ్జా, స్పెషల్​ సెక్రటరీ ప్రశాంత్​ వన్ పాటిల్, ఈఎన్​సీ అంజద్​ హుస్సేన్​ తదితరులు పాల్గొన్నారు.