కోదాడలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని నిర్మించాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కోదాడలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని నిర్మించాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, 
  • ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

కోదాడ, వెలుగు : జవహర్ నవోదయ విద్యాలయం నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లా కోదాడకు మంజూరైన నవోదయ విద్యాలయ నిర్మాణంపై ఆదివారం హైదరాబాద్ లో మంత్రి క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, నవోదయ విద్యాలయ సమితి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

 ఈ సందర్భంగా భవనాల డిజైన్లు ఖరారు చేశారు. మొత్తం 20 ఎకరాల స్థలంలో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలతోపాటు సిబ్బంది క్వార్టర్స్, ఇతర భవనాల నిర్మాణానికి సంబంధిన డిజైన్లు ఎలా ఉండాలనే అంశాలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ నవోదయ విద్యాలయ భవన నిర్మాణానికి రెండేళ్ల కాలపరిమితి ఉన్నా ఏడాది కాలంలోపు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 

ఈ విద్యాలయం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు వీలుంటుందన్నారు. ఈ క్యాంపస్ లో నిర్మాణాలు.. విద్యార్థులకు భద్రత కల్పించేలా ఉండాలని చెప్పారు. నిర్మాణపరంగా అత్యున్నత స్థాయి ప్రమాణాలు పాటించాలని సూచించారు. భవనాల నిర్మాణం ఆహ్లాదకరంగా, విద్యార్థులకు స్వాగతం పలికే విధంగా ఉండాలన్నారు. సమావేశంలో ఎన్వీఎస్ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అభిజిత్ భేరా, ఖమ్మం స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, ఎన్డీసీసీ డీజీఎం అబ్దుల్ రహీమ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.