ప్రజాస్వామ్యం నిలబడాలంటే కాంగ్రెస్ గెలవాలి : ఉత్తమ్ కుమార్ రెడ్డి  

ప్రజాస్వామ్యం నిలబడాలంటే కాంగ్రెస్ గెలవాలి : ఉత్తమ్ కుమార్ రెడ్డి  

మఠంపల్లి, వెలుగు : దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే పార్లమెంట్​ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం మఠంపల్లి మండలం మట్టపల్లి ఆర్యవైశ్య సత్రంలో పార్లమెంట్​ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి  హాజరై మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పదేండ్లుగా అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు.

గడిచిన పదేండ్లలో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందన్నారు.  రాష్ట్రంలో గడీల పాలనకు తెర దించామని, ఇక కేంద్రంలోని రాక్షసపాలనను అంతమొందించాలన్నారు. ఈనెల 30న జరిగే  ఎన్నికల సమీక్షా సమావేశంలో కాంగ్రెస్​అనుసరించాల్సిన విధానాలపై చర్చిస్తామని తెలిపారు.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్థికంగా నష్టపోయినా పార్టీని వీడలేదని, అలాంటి వారి త్యాగాలను పార్టీ మరువదన్నారు. సమావేశంలో కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న, మండల అధ్యక్షుడు మంజీ నాయక్, దొంగరి వెంకటేశ్వర్లు, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.