ప్రజాపాలనతోనే ప్రగతి.. విద్యా, వైద్య రంగాలు,సంక్షేమమే లక్ష్యం

ప్రజాపాలనతోనే ప్రగతి.. విద్యా, వైద్య రంగాలు,సంక్షేమమే లక్ష్యం
  •    సమస్యల పరిష్కారానికి 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక
  •     జిల్లా స్థాయి సమావేశాల్లో మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు 

వెలుగు :  ప్రజాపాలనతోనే ప్రగతి పథం సాధ్యమని,  విద్యా, వైద్య రంగాలు, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి, పలువురు కలెక్టర్లు, ఎమ్మెల్యేలు అన్నారు.   ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్​ జిల్లాల్లో జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించారు. వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో జరిగిన సమావేశాల్లో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో కలిసి మాట్లాడారు.  ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయిస్తోందని తెలిపారు. 

గడిచిన పదేండ్లలో  పాత ప్రభుత్వ పాలనలో చేసిన రూ. 8 లక్షల కోట్ల అప్పులకు రూ. 6,500 కోట్ల వరకు వడ్డీ కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. 64 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో 22 మంది ముఖ్యమంత్రులు రూ. 65 వేల కోట్ల అప్పులు చేస్తే  బీఆర్​ఎస్​ పాలనలో చేసిన అప్పు రాష్ట్రాన్నీ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో  ప్రభుత్వం వెనుకడుగు వేయదని తేల్చిచెప్పారు. పించన్లు,ఇందిరమ్మ ఇండ్లు,  రైతు రుణమాఫీ,  రైతు భరోసా పథకాలను వివరించారు. ఉమ్మడి పాలమూరు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే రెండున్నర సంవత్సరాల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్నీ పూర్తిచేస్తామన్నారు. దళారీ వ్యవస్థను నిర్మూలించి, ప్రజల అర్జీలను వేగంగా పరిష్కరించడమే లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని చెప్పారు. నారాయణపేట జిల్లాలో జరిగిన సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారుపాల్గొన్నారు. రూ. 5 వేల కోట్లతో మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి వలసల జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి ప్రకటించారు. గతంలో పాలమూరు ప్రజల జీవనం ఆగమ్యగోచరంగా ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇకపై నారాయణపేట జిల్లా వలసల జిల్లా కాదని, వలసలను తెచ్చుకొనే జిల్లా గా మారిపోనుందని తెలిపారు. నల్గొండలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ  ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని చెప్పారు. అయినప్పటికీ వివిధ రంగాల్లో సమస్యలను ఇంకా  పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు పంటల మార్పిడికి వెళ్లాలని, దేశ, కాల, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంటలపై అవగాహన కల్పించుకోవాలని సూచించారు.   

మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, సూర్యాపేటలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్  పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి, మహాలక్ష్మి లాంటి పథకాల ప్రయోజనాలను వివరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని, విద్యా వ్యవస్థను బలోపేతం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని పిలుపునిచ్చారు.  మెదక్‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ కుటుంబ జీవన భద్రత కోసం బీమా పథకాల అమలు, భూమి  సారాన్ని కాపాడేందుకు పంటల మార్పిడి, లాభదాయక వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. యువత అభివృద్ధిలో కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.  

సర్పంచ్​ల ఆవేదన

యాదాద్రి కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక మీటింగ్​లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, మహిళా కమిషన్​ చైర్​ పర్సన్​ బండ్రు శోభారాణి మాట్లాడి వెళ్లిపోయారు. అనంతరం సర్పంచ్​లకు మాట్లాడే అవకాశం కల్పించారు. పంచాయతీల్లో నిధుల కొరత వెన్నాడుతోందని పలువురు సర్పంచ్​లు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీ అకౌంట్లు ఫ్రీజ్ అవ్వడం, నిధుల కొరత వల్ల గ్రామాల్లో కనీసం తాగునీటి సమస్యను కూడా పరిష్కరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు పాత బిల్లులకే సరిపోయాయని, సొంత డబ్బులు ఖర్చు పెట్టినా బిల్లులు రావడం లేదని వాపోయారు. దీనిపై స్పందించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, సర్పంచ్‌‌‌‌ల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశాల్లో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ, కొత్త రేషన్ కార్డుల వివరాల వెల్లడి లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు.