అంజన్న జాతర కల్లా కోనేరును తీర్చిదిద్దుతాం : మంత్రి వాకిటి శ్రీహరి

అంజన్న జాతర కల్లా కోనేరును తీర్చిదిద్దుతాం : మంత్రి వాకిటి శ్రీహరి
  • మంత్రి వాకిటి శ్రీహరి 

మక్తల్, వెలుగు: శ్రీ పడమటి అంజన్న జాతర వరకు కోనేరును తీర్చిదిద్దుతామని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.  పడమటి అంజన్న కోనేరు సుందరీకరణ పనులను ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  డిసెంబర్ లో జరిగే పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలకు కోనేరును ఎవరూ ఊహించని రీతిలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, భక్తులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.  కోనేరును గతంలో ఎవరూ పట్టించుకోలేదని అపరిశుభ్రంగా మారిందన్నారు,  కోనేరును పూర్తిగా సుందరీకరణ చేసి, తిరుమల, యాదగిరి గుట్ట తరహాలో తీర్చిదిద్దుతామన్నారు. రాబోయే జాతర ఉత్సవాలకు భక్తులు కోనేటిలోనే స్నానం చేసి స్వామివారిని దర్శించుకునేలా చర్యలు చేపడతామని తెలిపారు. 

పూర్తిగా ఎమ్మెల్యే సొంత నిధులతో సుందరీకరణ పనులు చేపడుతున్నామన్నారు. ప్రముఖ ఆర్కిటెక్చర్ కల్పన కోనేరు సుందరీ కరణ పనులను పర్యవేక్షిస్తారన్నారు. ఆంజనేయ స్వామి భక్తులు, పట్టణ వాసులు సైతం కోనేరు సుందరీకరణ పనులలో భాగం కావచ్చన్నారు. ప్రతి ఒక్కరూ తలా చేయి వేసి కోనేరును మరింత సుందరంగా తయారు చేసుకునేందుకు భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆర్కిటెక్చర్ కల్పన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా కోనేరులను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు తాము భాగస్వామ్యం అవుతున్నామన్నారు.  అందులో భాగంగా నియోజకవర్గంలోని పలు కోనేరుల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వంశపారంపర్య ధర్మకర్త ప్రాణేష చారి, ఈఓ శాంసుందర చారి, మున్సిపల్ ఇంజనీర్ నాగశివ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవికుమార్, నాయకులు కట్ట సురేష్, వెంకటేశ్, గణేష్‌ కుమార్  గొల్లపల్లి నారాయణ తదితరులు పాల్గొన్నారు.