కాంగ్రెస్ పాలనలోనే  ప్రజలు హ్యాపీగా ఉన్నరు : మంత్రి వివేక్ వెంకటస్వామి

కాంగ్రెస్ పాలనలోనే  ప్రజలు హ్యాపీగా ఉన్నరు :  మంత్రి వివేక్ వెంకటస్వామి
  • కేసీఆర్‌‌ సర్కార్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు: మంత్రి వివేక్
  • కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తున్నదని వ్యాఖ్య
  • జూబ్లీహిల్స్​లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

జూబ్లీహిల్స్, వెలుగు: కాంగ్రెస్ పాలనలోనే రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించలేదన్నారు. హైదరాబాద్​లోని రహ్మత్ నగర్, బోరబండ డివిజన్లలో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుటుందని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గురువారం మంత్రి వివేక్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రహ్మత్​నగర్​లో రూ.20 లక్షలతో స్ట్రోమ్ వాటర్ పైప్​లైన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. 

‘‘రాజ్​నగర్, బంజారా నగర్, స్వరాజ్​నగర్​లో రూ.80 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు శంకుస్థాపన చేసినం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నది. రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అందజేస్తున్నది’’అని వివేక్ అన్నారు. అనంతరం రెహ్మత్​నగర్ డివిజన్ కార్మికనగర్​లోని కూరగాయల మార్కెట్​ను ఆయన సందర్శించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్​లు అందుతున్నాయా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఓ తోపుడు బండిపై అమ్ముతున్న పకోడి కొని తిన్నారు. చిరు వ్యాపారులతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిన్న చిన్న వ్యాపారులకు సర్కార్​ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు సీఎన్.రెడ్డి,బాబా ఫసియుద్దీన్ పాల్గొన్నారు.