రాజకీయం చేయొద్దు.. పార్టీలకు అతీతంగా పథకాలు : మంత్రి వివేక్ వెంకటస్వామి

రాజకీయం చేయొద్దు.. పార్టీలకు అతీతంగా పథకాలు : మంత్రి వివేక్ వెంకటస్వామి

ప్రజాప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట కలెక్టరేట్ లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు రైతు భరోసా 6 వేల రూపాయలు ఇస్తున్నట్లు చెప్పారు. 

ప్రజలు ఎవ్వరు కూడా అనుకోని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా కంప్లైంట్ రాలేదని.. బియ్యం సరిగా లేవని సిద్దిపేట నుండి కంప్లైంట్ రావడంపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

ఎన్నికల్లో హామీలు ఎన్ని ఇచ్చారో అవి అన్ని అర్హులైన వారికి వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు మంత్రి వివేక్. ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తున్నామని చెప్పిన మంత్రి..1970 తర్వాత బీద ప్రజలకు ఇంత మొత్తంలో ఇండ్లు ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి తో మాట్లాడి మరిన్ని ఇందిరమ్మ ఇళ్ళు పెంచేలా ప్రయత్నిస్తామని అన్నారు. 

రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలకు దిగారు. మాజీ సీఎం కేసీఆర్ ఫోటో చిన్నగా ఉందని.. ప్రోటోకాల్ పాటించడం లేదని ఆందోళనకు దిగారు. ఇంత మంచి కార్యక్రమాన్ని రాజకీయం చేయవద్దని సూచించారు. 

►ALSO READ | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు బరాబర్ అమలు చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్రంలో యూరియా కొరత  ఎక్కడా లేదన్నారు మంత్రి వివేక్. రాష్ట్రంలో మొత్తం 20 లక్షల  రేషన్ కార్డ్ లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని.. అర్హులందరికీ కార్డులు అందుతాయని చెప్పారు మంత్రి. అదే విధంగాఒకేసారి మొత్తం మూడు నెలల  సన్న బియ్యం ఇస్తున్నామని అన్నారు. 

ఇందిరమ్మ ఇళ్లు 60 గజాలలో పే కట్టుకోవాలని.. 600 స్కేర్ ఫీట్ కంటే ఎక్కువగా ఉంటే బిల్లు రాదని చెప్పారు మంత్రి. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం 23 వేల కోట్ల రుణమాఫీ చేసిందని.. రైతు భరోసా 6 వేలు ఎకరాకు చొప్పున అందరికీ ఇస్తున్నట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట ప్రాంతానికి మంచి బియ్యం  ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అని.. ఇప్పుడు కార్డులు పొందే వారికి కూడా సన్న బియ్యం ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇచ్చిన మూడు నెలల బియ్యంలో నూకలు వచ్చినట్లుగా కంప్లైంట్ వచ్చిందని.. భవిష్యత్తులోనైనా మంచి బియ్యం ఇవ్వాలని మంత్రి వివేక్ దృష్టికి తీసుకెళ్లారు హరీష్.