- కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టి ప్రజలపై భారం మోపారు: మంత్రి వివేక్ వెంకటస్వామి
- ఈ ప్రాజెక్టుతో రూ.3 వేల కోట్ల విద్యుత్ భారం పడిందని వెల్లడి
- ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణ చూసి బీఆర్ఎస్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నదని ఫైర్
- మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, మందమర్రిలో పర్యటన
కోల్‌బెల్ట్, వెలుగు: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసం రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. వారి హయాంలోనే ప్రాజెక్టు కుంగిపోయిందని, దానికి కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి 9వ వార్డులో మార్నింగ్ వాక్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని, వెంటనే పరిష్కరించాలని ఆఫీసర్లను ఆదేశించారు. రూ.40 కోట్లతో నిర్మిస్తున్న అమృత్ స్కీం డ్రింకింగ్ వాటర్ స్కీం పనులను పరిశీలించారు.
వార్డులోని అమ్మ గార్డెన్స్ వద్ద సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. మందమర్రి మండలం బొక్కలగుట్ట పంచాయతీలో మున్సిపల్, పంచాయతీ భూముల వివాదంపై కలెక్టర్ కుమార్ దీపక్, డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్, గ్రామ సర్పంచ్ మాసు శ్రీనివాస్, లీడర్లతోకలిసి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ, కేటీఆర్ కన్నెపల్లి పర్యటనతో ఆ పార్టీకి వచ్చే లాభం ఏం లేదని, ప్రజలు వాస్తవాలను గుర్తిస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును వారం రోజులు తమకు అప్పగిస్తే రాష్ట్రం మొత్తానికి నీళ్లు ఇస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. పదేండ్లలో చేయలేనిది వారం రోజుల్లో చేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక బీఆర్ఎస్ నేతలు రాజకీయ డ్రామాలకు దిగుతున్నారని ఫైర్ అయ్యారు.
కాళేశ్వరంపై శ్వేత పత్రం రిలీజ్ చేయండి..
కాళేశ్వరం కోసం ఎంత ఖర్చు చేశారు, ఎంత వాటర్ వాడారో బీఆర్‌ఎస్ శ్వేతపత్రం రిలీజ్ చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ వల్ల రూ.3 వేల కోట్ల విద్యుత్ భారం పడిందని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి రూ.36 వేల కోట్లతో ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టుకు కృషి చేశారని, గ్రావిటీ ద్వారా సాగు, తాగు నీరు అందించే ప్రాజెక్టును కాదని, కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం కట్టారన్నారు. రూ.60 వేల కోట్ల అప్పులున్న తెలంగాణను రూ.8 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. సిద్దిపేటలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వానికి వస్తున్న ఆదరణతో హరీశ్ రావుకు ఏమి చేయాలో తోచడం లేదని, అందుకే తరుచూ చెన్నూరు నియోజకవర్గానికి వస్తూ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఈసారి సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీలో రూ.80 కోట్ల పనులు...
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివేక్ వెంకటస్వామి అన్నారు. అన్ని వార్డుల్లో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. బొక్కలగుట్ట పంచాయతీ భూమి వ్యవహారం పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మందమర్రి తహసీల్దార్ సతీశ్ కుమార్, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్, డీఈ సాయి తదితరులతో కలిసి వివిధ అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సీఐ పర్స రమేశ్, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్‌రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ వొడ్నాల శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి అబ్దుల్ అజీజ్, సెక్రటరీ గోపతి బానేశ్, మాజీ టౌన్ ప్రెసిడెంట్ పల్లె రాజు, మున్సిపల్ కౌన్సిలర్లు భీమా మల్లేశ్, గుర్రం శ్రీనివాస్, ప్రభాకర్ పాల్గొన్నారు.
‘మంత్రులతో ముఖాముఖి’లో పాల్గొననున్న మంత్రి వివేక్
హైదరాబాద్, వెలుగు : గాంధీ భవన్ లో బుధవారం జరగనున్న మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొననున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గాంధీ భవన్ కు వచ్చే ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి మంత్రి వివేక్ వినతి పత్రాలను తీసుకోనున్నారు. సమస్యను బట్టి అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారం కోసం చొరవ చూపనున్నారు. ఈ ప్రోగ్రామ్ లో ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని గాంధీ భవన్ వర్గాలు విజ్ఞప్తి చేశాయి.
