కేసీఆర్ ఖజానా ఖాళీ చేసినా కాంగ్రెస్ సంక్షేమం ఆపలేదు..పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నది: మంత్రి వివేక్

కేసీఆర్ ఖజానా ఖాళీ చేసినా కాంగ్రెస్ సంక్షేమం ఆపలేదు..పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నది: మంత్రి వివేక్
  • గత బీఆర్ఎస్ సర్కార్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదు
  • మల్లన్నసాగర్ పేరిట ప్రజాధనం వృథా చేసింది
  • రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఫైర్
  • సిద్దిపేటలో రేషన్ కార్డుల పంపిణీకి హాజరు

సిద్దిపేట, వెలుగు: పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తున్నదని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసినా.. సీఎం రేవంత్ రెడ్డి పథకాలను ఆపకుండా కొనసాగిస్తున్నారని తెలిపారు. సిద్దిపేట, చిన్నకోడూరు, నంగనూరు, నారాయణరావు పేటలో మంత్రి వివేక్ రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. 

అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొత్త కార్డులు జారీ చేసింది. పేర్ల మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. కార్డుల పంపిణీ కూడా ప్రారంభించింది. సిద్దిపేట జిల్లాలో కొత్తగా 52వేల మంది లబ్ధిదారులు చేరారు. దొడ్డు బియ్యానికి బదులు.. సీఎం రేవంత్ సన్న బియ్యం ఇస్తున్నారు. దీని కోసం రూ.9వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. గతంలో అమలు చేసిన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్​ను మళ్లీ ప్రారంభించుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇండ్లు కడుతున్నాం’’అని వివేక్ అన్నారు. 

భవన నిర్మాణ కార్మికులకు బీమా కల్పించాలి

భవన నిర్మాణ కార్మికులకు.. కాంట్రాక్టర్లంతా రిజిస్ట్రేషన్ చేయించి బీమా అందేలా చూడాలని మంత్రి వివేక్ అన్నారు. ‘‘కరోనా టైమ్​లో చాలా మంది తాళి బొట్టు తాకట్టు పెట్టి వైద్యం చేయించుకున్నారు. ఈ పరిస్థితి చూసి సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చుల పరిమితిని రూ.10 లక్షలకు పెంచారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 10వేల టీచర్ పోస్టులను భర్తీ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం’’అని వివేక్ అన్నారు.

 ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, జిల్లా ఇన్​చార్జ్ పోలీస్ కమిషనర్ రాజేశ్ చంద్ర, కలెక్టర్ హైమావతి, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, తదితరులు పాల్గొన్నారు. కాగా, సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీస్​లో నియోజకవర్గ ఇన్​చార్జ్ పూజల హరికృష్ణతో కలిసి మంత్రి వివేక్ కార్యకర్తలతో భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. యూరియా కొరత లేకుండా చూడాలని చిన్నకోడూరు రైతులు మంత్రి వివేక్​కు వినతిపత్రం అందజేశారు.

సిద్దిపేట అభివృద్ధికి రూ.20 కోట్లు కేటాయించినం

సిద్దిపేట నియోజకవర్గానికి 3,500.. జిల్లాలో 10వేల ఇండ్లను మంజూరు చేశామని మంత్రి వివేక్ పేర్కొన్నారు. ‘‘కాకా వెంకటస్వామి.. సిద్దిపేట నుంచి ఎంపీగా 3 సార్లు గెలిచారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ప్రజాపంపిణీ వ్యవస్థ తీసుకొచ్చారు. ఆయన వారసునిగా రేషన్ కార్డులను పంపిణీ చేయడం సంతోషంగా ఉంది. సిద్దిపేట అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.20 కోట్లు కేటాయించినం. 

మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టి ప్రజా ధనాన్ని కేసీఆర్ వృథా చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. మల్లన్న సాగర్ తో ఏం ఉపయోగం లేదు. ఇక్కడికి మళ్లీ ఎల్లంపల్లి నుంచే నీళ్లు తీసుకురావాల్సి ఉంటుంది. ఏ సమస్య ఉన్నా.. కలెక్టర్​ను కలిసి పరిష్కరించుకోవాలి’’అని వివేక్ సూచించారు. క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.