
ప్రజాపాలనలో అన్ని వర్గాలకు మేలు జరుగుతోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని అన్నారు . ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పినట్టు చేసి చూపించామని చెప్పారు. సిద్దిపేట జిల్లాకు10 వేలకు పైగా ఇండ్లు, గజ్వేల్ నియోజకవర్గానికి మూడు వేలకు పైగా ఇండ్లు ఇచ్చామన్నారు.
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం శాకారం గ్రామంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆషాడమాసం వల్ల ఇండ్ల నిర్మాణంలో కాస్త ఆలస్యం అయిందని.. త్వరలో ఇండ్ల నిర్మాణం ఊపందుకుంటుందని తెలిపారు. ప్రజల సొంతింటి కల ఇందిరమ్మ ఇండ్ల ద్వారా నెరవేరుతుందన్నారు. 200 యూనిట్ ల కరెంట్ ఫ్రీగా ఇస్తున్నామని చెప్పారు. సన్న బియ్యం కోసం 12 వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నామని చెప్పారు.
ప్రజలు సన్న బియ్యం పట్ల సంతోషంగా ఉన్నారని వివేక్ వెంకటస్వామి అన్నారు. తొమ్మిది వేల కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. విద్యపై దృష్టి సారించాం.. స్కూళ్లు బాగు చేయించామన్నారు. గత పదేండ్లుగా బీఆర్ఎస్ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. రైతులకు రైతు భరోసా ఇచ్చామని తెలిపారు. అన్ని వర్గాలకు ప్రభుత్వం అండగా ఉందన్నారు. మహిళలకు వడ్డి లేని రుణాలు ఇస్తున్నామని చెప్పారు. గ్యాస్ రూ. 500 సబ్సిడీ స్కీమ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేద ప్రజలను ఆదుకునేందుకు కాంగ్రెస్ అన్ని కార్యక్రమాలు చేపడుతుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.