ఏటా 10 శాతం స్కూల్​ ఫీజులు పెంచుకోవచ్చు!

 ఏటా 10 శాతం స్కూల్​ ఫీజులు పెంచుకోవచ్చు!
  • ఏటా 10% ఫీజులు పెంచుకునేందుకు మంత్రుల కమిటీ ప్రతిపాదనలు
  • రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్​.. దీన్నే చట్టంలోకి తెచ్చే చాన్స్

హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో భారీగా ఫీజులున్నాయని, తగ్గించాలని స్టూడెంట్ల తల్లిదండ్రులు కోరితే.. మంత్రుల కమిటీ మాత్రం  ఏటా 10%  వరకు ఫీజులు పెంచుకునే వెసులుబాటును మేనేజ్​మెంట్లకు కల్పిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో 10,700 కార్పొరేట్​, ప్రైవేటు స్కూళ్లుండగా.. వీటిలో 30 లక్షల మందికిపైగా స్టూడెంట్లు చదువుతున్నారు. వీటిల్లో ఫీజుల నియంత్రణ కోసం 2017లో ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని వేసింది. ఆ కమిటీ పలు ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించింది. అయితే ఫీజుల నియంత్రణ కోసం చట్టం తీసుకొస్తామని చెప్తూ.. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్​తో కమిటీని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మంత్రుల కమిటీ ఈ నెల 2న ఎంసీఆర్ హెచ్​ఆర్డీలో సమావేశమై పలు ప్రతిపాదనలను సర్కారుకు పంపించింది. ఆ మినిట్స్ కాపీ బయటకు వచ్చింది. ఏటా 10 శాతం వరకు ఫీజులు పెంచుకోవచ్చని మంత్రుల కమిటీ ప్రతిపాదనలు చేసింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు స్కూల్​ లెవెల్​లో ఆ స్కూల్ మేనేజ్మెంట్ ప్రతినిధి చైర్మన్​గా ఓ కమిటీ ఉంటుందని, స్టేట్​ లెవెల్​లో  హైకోర్టు రిటైర్డ్‌‌‌‌ జడ్జీ చైర్మన్​గా మరో కమిటీ ఉంటుందని పేర్కొంది.  

స్కూల్​ లెవల్​ కమిటీలో అంతా తెలిసినోళ్లే!

స్కూల్ లెవెల్ కమిటీలో చైర్మన్​గా మేనేజ్​మెంట్ ప్రతిపాదించిన వ్యక్తి, సెక్రటరీగా స్కూల్ ప్రిన్సిపల్ ఉంటారు. మెంబర్స్​గా మేనేజ్​మెంట్​ ప్రతిపాదించిన ముగ్గురు టీచర్లతో పాటు ఐదుగురు పేరెంట్స్ ఉంటారు.  కమిటీలో మెజార్టీగా ప్రైవేటు స్కూళ్లకు అనుకూలమైన వారే ఉండటంతో.. 10 శాతం ఫీజులు పెంచుకునేందుకు ఈజీగా ఓకే చెప్తారని తల్లిదండ్రులు అంటున్నారు. అడ్మిషన్, ట్యూషన్ ఫీజును తప్పనిసరి ఫీజుగా, ట్రాన్స్ పోర్ట్, బోర్డింగ్, మెస్ తదితర ఫీజులను ఆప్షనల్ ఫీజులుగా మంత్రుల కమిటీ డివైడ్ చేసింది.

ఫీజుల వివరాలను స్కూల్ వెబ్ సైట్​లో పెట్టాలని, ఫీజులన్నీ డిజిటల్ మోడ్​లోనే వసూలు చేయాలని మంత్రుల కమిటీ సర్కారుకు ప్రతిపాదించింది. ఆ స్కూల్​లో ఎవరైనా స్టూడెంట్ తండ్రిగానీ, చదివించే వ్యక్తిగానీ చనిపోతే ఆ స్టూడెంట్ చదువు అయిపోయేదాకా ఫీజు తీసుకోవద్దని సూచించింది.  

పేరెంట్స్ పై భారం

రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లలో రూ. 20 వేల నుంచి రూ. 5 లక్షల వరకూ ఫీజులున్నాయి. వాస్తవానికి జీవో నెంబర్ 1 ప్రకారం ఏ స్కూల్ అయినా ఏటా  5%  మాత్రమే లాభాలు పొందేలా ఫీజులు తీసుకోవాలి. కానీ ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. ప్రస్తుతం బడుల్లో వసూలు చేస్తున్న ఫీజులను తగ్గించే అంశంపై కనీసం ఏ చర్చ జరిగలేదని తెలుస్తోంది. మంత్రుల కమిటీ మిటింగ్​ మినిట్స్​లో ఆ అంశమే లేకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నది.  ఏటా10 శాతం ఫీజులు పెంచుకునే   అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించడం అంటే ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులకు చట్టబద్ధత కల్పించడమే అవుతుందని పేరెంట్స్ ఆసోసియేషన్లు  ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

న్యాయ పోరాటం కొనసాగిస్తం

ఫీజులను తగ్గించాలని కోరితే, పెంచాలని నిర్ణయం తీసుకోవడం సరికాదు. ఏటా 10% ఫీజులు పెంచుకునే అవకాశమిస్తే, ఇంకా చట్టం ఎందుకు..? స్టేట్ ఫీజుల కమిటీలో పేరెంట్స్​ కు అవకాశమివ్వకపోవడం దారుణం. ప్రైవేటు స్కూళ్లలో అసలు పేరెంట్స్ కమిటీలే ఉండవు. ఉన్నా ఆ కమిటీలో మేనేజ్​మెంట్ల బంధువులే ఉంటారు. మంత్రుల కమిటీ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నం.  న్యాయపోరాటం ఇంకా కొనసాగిస్తం. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రస్తుతం బడుల్లో ఉన్న ఫీజులను తగ్గించాలి. ఉన్నవాటికి చట్టబద్దత కల్పించడం మానుకోవాలి. - వెంకట్, హైదరాబాద్​ స్కూల్స్​ పేరెంట్స్​ అసోసియేషన్​ ప్రతినిధి 

మంత్రుల కమిటీ ప్రతిపాదనల్లో ముఖ్యమైనవి..

  •     టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ పెట్టాలని నిర్ణయం. 
  •     బైలింగ్వల్ (ద్విభాష) టెక్ట్స్ బుక్స్ సెకండ్ క్లాస్ నుంచి ఉంటాయి.  2022–23, 2023–24 ఏండ్లలో ఫస్ట్ క్లాస్​కు ఇంగ్లిష్ మీడియంలోనే  పుస్తకాలు ముద్రించాలి. 
  •     ఉమ్మడి జిల్లాలో టీచర్ల రేషనలైజేషన్ చేయాలి. 
  •     టీచర్లందరికీ బయోమెట్రిక్ అటెండెన్స్ పెట్టాలి.