దుబ్బాక ఆర్టీసీ బస్టాండ్ ను ప్రారంభించిన మంత్రులు

దుబ్బాక ఆర్టీసీ బస్టాండ్ ను ప్రారంభించిన మంత్రులు

సిద్దిపేట, వెలుగు :  సిద్దిపేట, దుబ్బాకలో శుక్రవారం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,  వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు సుడిగాలి పర్యటన చేశారు. సిద్దిపేటలో ఆర్గానిక్ మేళాను ప్రారంభించిన మంత్రులు దుబ్బాకలో ఎమ్మెల్యే రఘునందన్ రావు తో కలసి హబ్షీపూర్ లో  వేర్ హౌజ్ ఆధ్వర్యంలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్లను మంత్రి నిరంజన్ రెడ్డి, దుబ్బాక ఆర్టీసీ బస్టాండ్ తో పాటు రాజక్కపేట నుంచి ముస్తాబాద్ వరకు రూ.13 కోట్ల తో నిర్మించే రోడ్డు పనులను పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. దుబ్బాక  పోతారం లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రెడ్డి సంక్షేమ సంఘ భవనాన్ని మంత్రి హరీశ్​ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి ఓపెన్​ చేశారు. అనంతరం దుబ్బాక వ్యవసాయ మార్కెట్ యార్డు లో ఏఎంసీ నూతన పాలక మండలి పదవీ స్వీకారోత్సవానికి మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ ఓట్ల కోసం బీజేపీ ఏమైనా చేస్తుందని,  చేరికల కమిటీ ఏర్పాటు చేయడమనేది పార్టీలను చీల్చడం కోసమేనని, పక్క పార్టీలను బెదిరించి గుంజుకోవడమే వారి పని ఆరోపించారు. బీజేపీ నేత బీఎల్ సంతోష్  30 సీట్ల మాటతోనే తెలంగాణలో బీజేపీకి అధికారం దక్కదనే విషయం అర్థమైందన్నారు. గోవును తాము పూజిస్తే బీజేపీ రాజకీయాలకు వాడుకుని మలినం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత జన్ ధన్ యోజన ద్వారా డబ్బులు ఇస్తామని అకౌంట్లో ఓపెన్ చేయించి ఇంతవరకు ఒక్క రూపాయి వేయలేదన్నారు.  కోట్ల కొలువులు ఇస్తామని మాటతప్పడమే కాకుండా ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడమే బీజేపీ పనిగా పెట్టుకుందని ఆరోపించారు. మాయమాటలు చెప్పితే ఇకపై దుబ్బాక ప్రజలు మోసపోరని,  ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దుబ్బాకలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి, ఎమ్మెల్సీలు  ఫారుఖ్ హుస్సేన్, బండ ప్రకాశ్, టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ మాట్లాడారు. 

సిద్దిపేటలో ఆర్గానిక్ మేళా..

సిద్దిపేట మల్టీ పర్పస్ హైస్కూలులో బాల వికాస ఆధ్వర్యంలో ఆర్గానిక్ మేళాను ముగ్గురు మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మోతాదుకు మించి రసాయన ఎరువుల వాడకం వల్ల భూమి నిస్సారమై పోతుందన్నారు. దేశంలో జనాభా అవసరాలకు సరిపోయ్యే విధంగా ఆహారధాన్యాలను ఉత్పత్తి చేసే లక్ష్యంతో రసాయనిక ఎరువులు, ఆధునిక వంగడాలను ప్రవేశ పెట్టినా వాటిని వాడే విధానంపై రైతులకు అవగాహన కల్పించడంలో బీజేపీ పాలకులు విఫలమయ్యారన్నారు. ప్రపంచమంతా భూసార  సంరక్షణ, టెర్రరిజం నిర్మూలన, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తుంటే  కేంద్ర ప్రభుత్వం మాత్రం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య  చిచ్చు పెట్టి కొట్టుకుంటుంటే  చోద్యం చూస్తోందని విమర్శించారు. -భూమిని సారవంతం చేయడంలో సేంద్రియ ఎరువులు ప్రధాన భూమిక పోషిస్తాయని, సిద్దిపేటకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నానని ఆయన తెలిపారు. అంతకు ముందు చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ లోని ఆయిల్ ఫామ్ నర్సరీని  మంత్రులు నిరంజన్ రెడ్డి, హరీశ్​ రావు సందర్శించారు. జిల్లాలో పది వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పనిచేస్తున్నట్టు హరీశ్​రావు వివరించారు.

పోటా పోటీ నినాదాలతో ఉద్రిక్తత 

దుబ్బాకలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్​ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముగ్గురు మంత్రులకు స్వాగతం పలుకుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు హబ్షీపూర్ చౌరస్తా నుంచి దుబ్బాక వరకు బైక్ ర్యాలీ నిర్వహించగా బీజేపీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. హబ్షీపూర్ వద్ద వేర్ హౌజ్ గోడౌన్ల ప్రారంభోత్సవం సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంత్రి హరీశ్​రావు తీవ్ర  అసహనం వ్యక్తం చేస్తూ గోడౌన్లను ప్రారంభించి కార్యాలయాన్ని ప్రారంభించడకుండానే వెళ్లిపోయారు. అంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్దకు బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు చేరుకుని పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరుగగా పోలీసులు కల్పించుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సీపీ శ్వేత దుబ్బాకలోనే మకాం వేసి పరిస్థితులు చేజారకుండా పర్యవేక్షించారు.