
- బాయ్స్ కాలేజీ లోకంప్యూటర్లు మాయం
- ఒకరు సస్పెన్షన్.. మరొకరిపై చర్యలకు ఆదేశం
- పర్యవేక్షణ లోపంతో ప్రిన్సిపాళ్ల ఇష్టారాజ్యం
వనపర్తి/వనపర్తి టౌన్, వెలుగు: వనపర్తి జిల్లాలోని మైనారిటీ గురుకులాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మైనారిటీ గురుకుల స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ప్రిన్సిపాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. వనపర్తిలో బాయ్స్, గర్ల్స్ జూనియర్ కాలేజీలు ఉండగా, పెద్దమందడి శివారులో బాయ్స్ స్కూల్ ఉంది. కొత్తకోట మండలం కానాయపల్లిలో బాయ్స్ స్కూల్ అమడబాకుల సమీపంలో బాయ్స్ జూనియర్ కాలేజీ కొనసాగుతున్నాయి. ఒక్కో స్కూల్ లో 400 నుంచి 500 మంది స్టూడెంట్లు, జూనియర్ కాలేజీల్లో ఒక్కో కోర్సులో 40 మంది చొప్పున 160 మంది దాకా స్టూడెంట్లు చదువుకుంటున్నారు.
కంప్యూటర్లు మాయం!
వనపర్తిలోని మైనారిటీ బాయ్స్ జూనియర్ కాలేజీలో గత నెల 22న 12 కంప్యూటర్లు మాయం కావడం కలకలం రేపింది. 28న విజిలెన్స్ అధికారుల తనిఖీలో ఈ విషయం బయటపడింది. సీసీ కెమెరాలు మాయం కావడం, సెక్యూరిటీ గార్డులు, సిబ్బంది పనితీరు సరిగా లేదనే విషయం వెలుగులోకి వచ్చింది. ఏడాది నుంచి కాలేజీలో సీసీ కెమెరాలు పని చేయకపోయినా పట్టించుకోలేదని అంటున్నారు. కాలేజీలో ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో 120 మంది స్టూడెంట్లు చదువుతుండగా, రాత్రికి రాత్రి కంప్యూటర్లు ఎలా మాయమయ్యాయనే విషయం అంతుపట్టడం లేదు.
ఈ విషయాన్ని కింది స్థాయి సిబ్బంది కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీధర్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా, బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కాలేజీ స్టూడెంట్లే టీవీ ధ్వంసం చేశారని, కంప్యూటర్లు తీసుకెళ్లారని చెబుతున్నారు. ఈ ఘటనపై మైనార్టీ గురుకులాల సెక్రటరీ షపీయుల్లా స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రిన్సిపాల్ తీరుపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు గత నెలలో ఇక్కడి స్టూడెంట్లు కాలినడకన కలెక్టరేట్‌కు బయలుదేరగా, ఓ పార్టీ నేత వారికి నచ్చజెప్పి కాలేజీకి తిప్పి పంపించారు.
కాలేజీని తరలించాలి..
పట్టణంలోని బాయ్స్ జూనియర్ కాలేజీ ఇండ్ల మధ్య ఉంది. కొందరు స్టూడెంట్లు రాత్రి వేళల్లో మద్యం మత్తులో ప్లేట్లు, గ్లాసులతో శబ్దాలు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని సాయినగర్ కాలనీవాసులు చెబుతున్నారు. స్టూడెంట్లను కాలేజీ ప్రిన్సిపాల్, మహిళా పీడీ కంట్రోల్ చేయకపోవడంతోనే ఈ పరిస్థితి ఉందని అంటున్నారు. రాత్రి వేళల్లో స్టూడెంట్ల ఆగడాలు ఎక్కువయ్యాయని కాలేజీని ఇక్కడి తరలించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
పర్యవేక్షణ లోపంతోనే..
మైనార్టీ గురుకులాలను ఆర్ఎల్సీ, కో ఆర్డినేటర్, విజిలెన్స్, డీఎండబ్ల్యూవో నిరంతరం విజిట్ చేస్తారు. కాలేజీలు, స్కూళ్ల ప్రిన్సిపాళ్లు ఉన్నతాధికారుల విజిట్ సమయంలో హడావుడి చేసి ఊరుకుంటున్నారు. వనపర్తి బాయ్స్ జూనియర్ కాలేజీని డీఎండబ్ల్యూవో పలుమార్లు విజిట్ చేసినా, కాలేజీలో సమస్యలపై దృష్టి పెట్టలేదని అంటున్నారు. దీంతో కంప్యూటర్లు మాయమైన వ్యవహారం బయటకు రాలేదని చెబుతున్నారు. దీంతోపాటు పెద్దమందడిలో కొనసాగుతున్న మైనార్టీ స్కూల్ ప్రిన్సిపాల్ డ్యూటీలో నిర్లక్ష్యం చేయడంతో ఇటీవల సస్పెన్షన్ చేశారు.
ఎంక్వైరీ చేస్తాం..
వనపర్తి బాయ్స్ జూనియర్ కాలేజీలో కంప్యూటర్లు మాయం అయిన విషయం వాస్తవమే. ఈ విషయం విజిలెన్స్ ఆఫీసర్ల ద్వారా తెలిసింది. దీనిపై పూర్తి విచారణ చేసి కలెక్టర్, టెమ్రిస్ సెక్రటరీకి నివేదిక ఇస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.- అఫ్జలుద్దీన్, డీఎండబ్ల్యూవో