Pawan Kalyan: 'OG' కోసం 'మిరాయ్'త్యాగం.. థియేటర్లు అప్పగింత, ఫ్యాన్స్ ఫిదా!

Pawan Kalyan: 'OG' కోసం 'మిరాయ్'త్యాగం.. థియేటర్లు అప్పగింత, ఫ్యాన్స్ ఫిదా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఓజీ' (They Call Him OG) సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.  దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా కోసం కేవలం అభిమానులే కాదు, సినీ పరిశ్రమ కూడా ఎదురుచూస్తోంది. ఇవాళ బుధవారం (సెప్టెంబర్ 24) రాత్రి ప్రీమియర్ షోలు వేయనున్నారు. ఈ సమయంలో, 'ఓజీ' విడుదలకు అండగా నిలబడి, 'మిరాయ్' (Mirai) నిర్మాత విశ్వప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

నిర్మాత నిర్ణయానికి ఫ్యాన్స్ ఫిదా!

సెప్టెంబర్ 12న విడుదలై మంచి విజయాన్ని అందుకున్న తేజ సజ్జా చిత్రం 'మిరాయ్', ఇప్పటికీ పలు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. హౌస్‌ఫుల్ బోర్డులతో దూసుకుపోతున్న ఈ సినిమాను, కొత్త సినిమా కోసం తొలగించడం సాధారణంగా జరగదు. అయితే, 'ఓజీ' లాంటి భారీ సినిమా తొలిరోజున ప్రేక్షకులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో నిర్మాత విశ్వప్రసాద్‌ కీలక నిర్ణయం తీసుకుని పవన్ కళ్యాణ్ కు తోడుగా నిలిచారు.

సెప్టెంబర్ 25న 'మిరాయ్' ప్రదర్శితమవుతున్న కొన్ని ముఖ్యమైన థియేటర్లలో కేవలం ఒక్క రోజు కోసం 'ఓజీ'ని ప్రదర్శించడానికి ఆయన అనుమతి ఇచ్చారు. మరుసటి రోజు, సెప్టెంబర్ 26 నుంచి యథావిధిగా ఆ థియేటర్లలో 'మిరాయ్' షోలు కొనసాగుతాయి. తన సినిమా బాగా ఆడుతున్నప్పటికీ, పవన్ కళ్యాణ్‌పై ఉన్న గౌరవంతో 'ఓజీ' కోసం ఈ త్యాగం చేసిన విశ్వప్రసాద్‌పై పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా పట్ల, పరిశ్రమ పట్ల ఆయనకున్న నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తోందంటున్నారు.

తొలగిన ఓవర్సీస్‌లో అడ్డంకులు

ఇప్పటికే  ఓవర్సీస్ మొత్తంలో 3.3 మిలియన్ల డాలర్లుకి పైగా (రూ.29 కోట్లు) దక్కించుకుని సత్తా చాటింది. కేవలం ఒక్క నార్త్ అమెరికాలోనే 2.6 మిలియన్ డాలర్లు (రూ.23కోట్లు)కి పైగా కలెక్ట్ చేసింది. అయితే భారీ బడ్జెట్‌తో DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందు  ఓవర్సీస్‌లో  కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా, నార్త్ అమెరికాలో డిజిటల్ ప్రింట్‌ల విషయంలో ఆలస్యం జరుగుతోందని, కెనడాలో కొన్ని కారణాల వల్ల సినిమా ప్రదర్శన నిలిపివేశారని ఇటీవల నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది. 

►ALSO READ | Ghaati OTT Release: OTTలోకి అనుష్క 'ఘాటి'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

దీంతో ఓవర్సీస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, ఎట్టకేలకు ఆ సమస్యలన్నీ తొలగిపోయాయి. డిస్ట్రిబ్యూటర్లు ఎక్స్  వేదికగా ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రింట్‌లు సకాలంలో థియేటర్లకు చేరుకోవడంతో, సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్‌ను, సుజీత్ టేకింగ్‌ను గ్యాంగ్‌స్టర్ డ్రామాలో చూడటానికి ఓవర్సీస్ ప్రేక్షకులు ఉత్సాహంగా ఉన్నారు.

'ఓజీ'లో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా పరిచయం అవుతున్నారు. ఎస్. థమన్ సంగీతం అందించారు.  'ఓజీ' ఫీవర్ అభిమానుల్లో తారాస్థాయికి చేరుకుంది.