నిధులు మళ్లించిన సెక్రటరీ.. వార్డు మెంబర్స్ ధర్నా

నిధులు మళ్లించిన సెక్రటరీ.. వార్డు మెంబర్స్ ధర్నా

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామ సెక్రటరీ గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడని సర్పంచ్, వార్డు సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు తెలియకుండానే డబ్బులు డ్రా చేశారని ధర్నాకు దిగారు. ఈ అంశంపై సెక్రటరీని నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని వార్డు సభ్యులు ఆరోపిస్తున్నారు. డీపీఓ, ఎండీవో ఆదేశాలతో రూ.36 వేలు డ్రా చేసి సీసీ ఛార్జీలు, కరెంట్ బిల్లులు కట్టానని చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం ఇస్తున్న నిధులను.. గ్రామ పంచాయితీ తీర్మానం లేకుండా ఎలా డ్రా చేస్తారని వార్డు సభ్యులు ప్రశ్నిస్తున్నారు. సెక్రటరీ డబ్బులు డ్రా చేస్తుంటే సర్పంచ్ ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. డబ్బులు డ్రా చేస్తున్న విషయం తెలియని సర్పంచ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

వాస్తవానికి నిధుల మళ్లింపుపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో మంగళవారం బీఆర్ఎస్ కు 18 మంది సర్పంచులు రాజీనామా చేశారు. అప్పులు చేసి మరీ పనులు చేయించినా ప్రభుత్వం నుంచి బిల్లులు ఇవ్వకపోగా.. వచ్చిన నిధులను కూడా దారి మళ్లిస్తున్నారని వారు ఆరోపించారు.