రాష్ట్రంలో మహిళా భద్రత భేష్‌.. సంతృప్తి వ్యక్తం చేసిన మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్లు

రాష్ట్రంలో మహిళా భద్రత భేష్‌.. సంతృప్తి వ్యక్తం చేసిన మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్లు
  • అభిప్రాయాలను రికార్డ్ చేసిన విమెన్ సేఫ్టీ వింగ్‌
  • డాక్యుమెంటరీ రూపొందిస్తున్న వింగ్!

రాష్ట్రంలో మహిళా భద్రత భేష్‌‌‌‌ రాష్ట్రంలో మహిళా భద్రతకు తీసుకుంటున్న చర్యలపై మిస్ వరల్డ్‌‌‌‌–2025 కంటెస్టెంట్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌‌‌‌లో అర్ధరాత్రి కూడా మహిళలు ఒంటరిగా తిరిగే పరిస్థితి ఉండడం ఆశ్చర్యపరిచిందని తమ మనోగతాన్ని వెల్లడించారు. తమకు అందుతున్న సెక్యూరిటీపైన రాష్ట్ర విమెన్ సేఫ్టీ వింగ్ అధికారులకు హ్యాట్సాఫ్‌‌‌‌ చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర విమెన్ సేఫ్టీ వింగ్‌‌‌‌ ఓ డాక్యుమెంటరీని తయారు చేస్తున్నది. ఈవెంట్లలో పాల్గొనేందుకు వచ్చిన కంటెస్టెంట్ల అభిప్రాయాలను ఆదివారం రికార్డ్‌‌‌‌ చేసింది. గచ్చిబౌలిలోని ఓ హోటల్‌‌‌‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళా భద్రతకు సంబంధించిన అంశాలపై విమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు కంటెస్టెంట్లను కలిశారు.

మహిళా పోలీసుల బందోబస్తులో..
మిస్‌‌‌‌ వరల్డ్‌‌‌‌-2025 పోటీల్లో భాగంగా గత కొన్ని రోజులుగా తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో పర్యటక ప్రాంతాలతోపాటు పలు కార్యక్రమాలకు మహిళా పోలీసుల ఆధర్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్టులో దిగినప్పటి నుంచి వారు బస చేసే హోటల్‌‌‌‌ మొదలు, పర్యటనలు ఈవెంట్లు కార్యక్రమాల సందర్భంగా మహిళా సిబ్బంది సైతం భద్రత విధుల్లో కీలకంగా వ్యవహరించారు. ఈ నెల18న మిస్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ పోటీదారులు బంజారాహిల్స్‌‌‌‌లోని ఇంటిగ్రేటెడ్‌‌‌‌ కమాండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌ (ఐసీసీసీ)ను ప్రత్యేకంగా సందర్శించారు.

మహిళలు, చిన్నారుల భద్రతపై..
కమాండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌లోని సీసీటీవీ మానిటరింగ్‌‌‌‌ వ్యవస్థ, శాంతిభద్రతల గురించి వివరించారు. రాష్ట్రంలో మహిళా భద్రత విభాగంలోని మహిళలు, చిన్నారుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు వారికి వివరించారు. వీటన్నింటిపైనా మిస్‌‌‌‌వరల్డ్‌‌‌‌ పోటీదారులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను డాక్యుమెంటరీ రూపంలో పొందుపరుస్తున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఈ క్రమంలోనే పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ వైదొలగిన తరువాత చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు అంతర్గత విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా మిల్లా మాగీతో కలిసిన బస చేసిన కొంత మంది నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం.