బాలసదన్ చిన్నారులతో అందగత్తెల ఆటపాటలు .. హోటల్ ట్రైడెంట్‌‌‌‌లో హార్ట్ ఆఫ్ గోల్డ్ ఈవెంట్

బాలసదన్ చిన్నారులతో అందగత్తెల ఆటపాటలు .. హోటల్ ట్రైడెంట్‌‌‌‌లో హార్ట్ ఆఫ్ గోల్డ్ ఈవెంట్
  • ‘హార్ట్ ఆఫ్ గోల్డ్’ ఈవెంట్ లో అనాథ పిల్లలతో గడిపిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు 
  • చదువుతోనే వెలుగు అంటూ స్ఫూర్తి సందేశం 
  • 200 మంది అనాథ పిల్లలకు ఏడాదిపాటు సాయం
  • ఒక్కో చిన్నారికి రూ. 25 వేల కిట్లు అందజేసిన కంటెస్టెంట్లు  

హైదరాబాద్, వెలుగు: మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటున్న అందాల భామలు అనాథ పిల్లలతో కలిసి సరదాగా ఆడిపాడారు. బుధవారం హైదరాబాద్ లోని హోటల్ ట్రైడెంట్‌‌‌‌లో ‘హార్ట్ ఆఫ్ గోల్డ్’ పేరిట ఈ మేరకు వినూత్న ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్, నారాయణపేట జిల్లాల బాలసదన్ ల నుంచి వచ్చిన అనాథ పిల్లలతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఉల్లాసంగా గడిపారు. అందాల భామలను కలిసి, వారితో ముచ్చటించే అవకాశం లభించినందుకు చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు. కంటెస్టెంట్లు చిన్నారులతో కలిసి ఆడుతూ, పాడుతూ ఆనందం పంచుకున్నారు. వారితో సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. లైవ్ బ్యాండ్ సంగీతానికి ముద్దుగుమ్మలు చిన్నారులతో కలిసి నృత్యాలు చేస్తూ సందడి చేశారు.   

200 మంది పిల్లలకు సాయం 

మిస్ వరల్డ్ సంస్థతో కలిసి బాలసదన్ లోని 200 మంది అనాథ పిల్లలకు ఏడాదిపాటు సహాయం చేసేందుకు ఫార్చ్యూన్ హాస్పిటాలిటీ, సుదీక్ష ఎస్టేట్స్ సంస్థలు స్పాన్సర్‌‌‌‌ షిప్ లు ప్రకటించాయి. ఈ సందర్భంగా కంటెస్టెంట్లు ఒక్కో విద్యార్థికి రూ.25 వేల విలువ చేసే కిట్లు అందజేశారు. పాఠ్యపుస్తకాలు, పౌష్టికాహారం, నెలవారీ సరకులు, దుస్తులు, స్వెటర్లు, రెయిన్‌‌‌‌కోట్లు, డ్రెస్సులు, స్కూల్ కిట్లు (బ్యాగ్‌‌‌‌లు, వాటర్ బాటిళ్లు, టిఫిన్ బాక్స్‌‌‌‌లు),  డిజిటల్ వాచ్‌‌‌‌లు, చదువుకు సంబంధించిన ఆట బొమ్మలు, ట్రాలీ బ్యాగ్‌‌‌‌లు, ప్రొటీన్ పౌడర్ తదితర వస్తువులతో కూడిన కిట్లను చిన్నారులకు అందించారు. వీరికి ఏడాదిపాటు చేయూతను అందించనున్నట్లు దాతలు ప్రకటించారు. విక్టోరియా మెమోరియల్ పాఠశాల పునరుద్ధరణకు కూడా దాతలు ముందుకొచ్చారు.  

సేవా గుణం చాటే అందాల పోటీలు 

మిస్ వరల్డ్ సంస్థ చైర్‌‌‌‌పర్సన్, సీఈవో జూలియా మోర్లే మాట్లాడుతూ.. మిస్​వరల్డ్ పోటీలు సేవా గుణాన్ని కూడా చాటుతాయన్నారు. పోటీదారులు చిన్నారులతో కలిసిపోవడం అభినందనీయమన్నారు. విద్యతోనే విజయమని, థింక్ బిగ్.. థింక్ డిఫరెంట్ అచీవ్ గోల్స్ అని స్ఫూర్తి దాయక సందేశాన్ని అందాల భామలు ఇచ్చారు. పిల్లలు అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానాలు చెప్పారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడితే ఏదైనా సాధించవచ్చన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు బాగా నచ్చాయని మిస్ స్లోవేనియా అలిదా టోమానిక్​అన్నారు. బాలసదన్ చిన్నారి శిరీష మాట్లాడుతూ.. మిస్​వరల్డ్​బ్యూటీలను కలవడం సంతోషంగా ఉందని చెప్పింది. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న స్ఫూర్తి కలిగిందని, ఈ అనుభవం తమకు జీవితాంతం గుర్తుంటుందని తెలిపింది.