
- స్వాగత సత్కారాలకు ఏర్పాట్లు పూర్తి
- జిగేల్ మంటున్న వెయ్యిస్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప టెంపుల్
- ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు
- విశ్వవ్యాప్తంగా కానున్న కాకతీయుల గొప్పదనం
వరంగల్/ వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన కంటెస్టెంట్స్నేడు ఓరుగల్లులో పర్యటించనున్నారు. దాదాపు 800 ఏండ్లనాటి కాకతీయుల పాలన, శిల్పకళ సంపద, అద్భుతమైన కట్టడాలు, దేవాలయాల గొప్పదనం తెలుసుకోడానికి వరల్డ్ బ్యూటీస్ వస్తున్నారు. మధ్యాహ్నం 4.35 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగే వారి పర్యటన సక్సెస్ చేయడానికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రంగంలోకి దిగారు. జిల్లాలో అడుగుపెట్టాక స్వాగతం, ఆతిథ్యం మొదలు సదుపాయాలు, కావాల్సిన ఆహారం, ప్రయాణం, సెక్యూరిటీ విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
న్యూస్ కవరేజీకి ఇంటర్నేషనల్ మీడియా..
వరల్డ్ బ్యూటీస్ పర్యటనలో ఓరుగల్లు కాకతీయుల చరిత్ర విశ్వవ్యాప్తం కానున్నది. సుందరీమణులు, వివిధ దేశాలకు చెందిన కార్పొరేట్ ప్రతినిధులే కాకుండా 18–20 దేశాలకు చెందిన ఇంటర్నేషనల్ మీడియా ప్రతినిధులు సైతం మిస్ వరల్డ్ ఈవెంట్ కవరేజీ కోసం ఓరుగల్లుకు వస్తున్నారు. తద్వారా కాకతీయుల పాలన, శిల్పకళ సౌందర్యాన్ని ప్రపంచం మొత్తానికి చూపనున్నారు.
ఏర్పాట్లలో ఐఏఎస్, ఐపీఎస్‍లు..
మిస్ వరల్డ్ బ్యూటీస్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగున్నర గంటల పర్యటనపై ప్రధానంగా ఐదుగురు ఐఏఎస్‍లు, ఇద్దరు ఐపీఎస్‍లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాల్లో పర్యటన నేపథ్యంలో మూడు జిల్లాల కలెక్టర్లు సత్యశారద, ప్రావీణ్య, దివాకర్ ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సు దిగాక స్వాగత కార్యక్రమం మొదలు హోటల్లో బస, పర్యటన, గైడ్, ఫుడ్, డిన్నర్ నుంచి చివర్లో ఆత్మీయ సన్మానం వరకు ఆయా శాఖల అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నారు.
మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే గ్రేటర్ సిటీ అంతటా పరిశుభ్రత, పచ్చదనం, లైటింగ్ వంటి అంశాలను పర్యవేక్షిస్తుండగా, ఎన్‍పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‍రెడ్డి విద్యుత్ సేవలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‍ప్రీత్‍సింగ్, ములుగు ఎస్పీ శబరీశ్ పోలీస్, మిలిటరీ సిబ్బందితో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ, డ్రోన్ కెమెరాలు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం ద్వారా మూడంచెల భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
వీరికి ట్రైనీ ఐపీఎస్‍లు, ఐఏఎస్‍లు, అడిషనల్ కలెక్టర్లు సహకారం అందిస్తున్నారు. ఒక్క కమిషనరేట్ పరిధిలోనే 3 డీసీపీలు, 1 అడిషనల్ డీసీపీ, 11 ఏసీపీలు, 32 మంది సీఐలు, 81 మంది ఎస్సైలు, 155 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 325 మంది కానిస్టేబుళ్లు, 106 మంది మహిళా పోలీస్, 210 మంది హోంగార్డ్స్, డిస్ట్రిక్ట్ గార్డ్స్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్వ్కాడ్ సిబ్బందితో కలిపి దాదాపు 1000 మంది పనిచేయనున్నారు. రామప్ప వద్ద ఒక ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 14 మంది సీఐలు, 43 మంది ఎస్ఐలు, 127 మంది ఏఎస్ఐ లు, 360 మంది పురుషులు, 160 మంది మహిళా కానిస్టేబుల్స్, 54 మంది హోంగార్డులు, 113 మంది టీజీఎస్‌పీ కానిస్టేబుల్స్ కలిపి మొత్తం 100 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కలర్‍ఫుల్‍గా కాకతీయ కట్టడాలు..
వివిధ దేశాల నుంచి అందగత్తెలు వస్తున్న క్రమంలో ఓరుగల్లు కాకతీయ కట్టడాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. వెయ్యిస్తంభాల గుడిలో గులకరాళ్లు, మట్టితో ఉండేచోట పచ్చని కార్పెట్లు పరుస్తున్నారు. కాకతీయుల రాజధాని వరంగల్ కోటలో కీర్తి తోరణాలు, శిల్పసంపదపై దుమ్ముధూళి తొలగించి, రంగులు అద్దారు. సౌండ్ అండ్ లైటింగ్ షో కోసం మరమ్మతులు చేశారు. ఇల్యూమినేషన్ లైట్లు బిగించారు. వెయ్యిస్తంభాల గుడి, ఖిలా వరంగల్ కోటతోపాటు యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం, ఇంటర్ ప్రీటిషన్ సెంటర్ వద్ద రాత్రి సమయాల్లో జిగేల్ మనేలా లైట్లు ఏర్పాటు చేశారు. బోటింగ్ చేసే ప్రదేశంలో కొత్తగా మెట్లను ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దారు.