తెలంగాణ ఆర్థిక వృద్ధికి మిస్ వరల్డ్ చేయూత

తెలంగాణ ఆర్థిక వృద్ధికి మిస్ వరల్డ్ చేయూత

తెలంగాణ రాష్ట్రంలో  కేసీఆర్ సర్కార్ ఇ కార్ రేస్ పెట్టి కోట్ల రూపాయల నష్టం చేస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ వరల్డ్ షి బ్యూటీ రేస్ (మిస్ వరల్డ్​ పోటీలు)పెట్టి తెలంగాణ రాష్ట్రంలోని టూరిజం స్పాట్స్​కు  ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెస్తున్నాడు,  తెలంగాణ ఆర్థికాభివృద్ధికి ప్రపంచ దేశాల నుంచి కాసులు తెప్పిస్తున్నాడు.

 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటగా అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వ కుటుంబ పాలనతో తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్​ ముఖ్యమంత్రిగా,  షాడో  ముఖ్యమంత్రులుగా కేటీర్, హరీష్ రావు, కవిత, సంతోష్​రావు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.  16 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో 2014లో వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని.. అభివృద్ధి పేరుతో  8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని నిండా అప్పుల ఊబిలో ముంచి కాంగ్రెస్ పార్టీ చేతికి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్పారు దొరలు.

రా  ష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి  2023 డిసెంబర్ 3న  ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత  తెలంగాణ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే.. రాష్ట్రంలోని అన్ని శాఖలలో పెండింగ్​లో ఉన్న బిల్లులు, ఆర్థికశాఖ లెక్కల ప్రకారం 8 లక్షల కోట్ల రూపాయలను కేసీఆర్​ ప్రభుత్వం అప్పులు చేసినట్టు లెక్కలు బయటపడ్డాయి.  కాంగ్రెస్ పార్టీ చేతికి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత  బీఆర్ఎస్​ ప్రభుత్వం పెండింగులో పెట్టిన బిల్లులు రిలీజ్ చేయాలని సర్పంచ్​లు, కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తుంటే  బీఆర్​ఎస్​ నాయకులు  వారిని మభ్యపెట్టి  రాజకీయ లబ్ధి కోసం ద్వంద్వ వైఖరితో మద్దతు ఇస్తున్నారు.  

బీఆర్ఎస్​ ప్రభుత్వం పెండింగ్​లో పెట్టిన బిల్లుల క్లియరెన్స్​కోసం ధర్నా  జరుగుతుంటే  సిగ్గులేకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై,  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై  బీఆర్ఎస్​ నాయకులు విమర్శలు చేస్తున్నారు.  మొన్న ఆర్టీసీ ఉద్యోగులు తమ డిమాండ్స్ నెరవేర్చాలని మే 7న సమ్మెకు సైరన్ ఊదగా.. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పోలీస్ అధికారుల మీటింగ్​లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎటువంటి దాపరికం లేకుండా ప్రజలకు వివరించారు.  

ప్రజలపై  బీఆర్ఎస్ అప్పుల భారం 

కొత్త డిమాండ్స్ కోసం ఉద్యమాలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ పాలన గాడి తప్పి దివాలా తీస్తుందని ఆర్థిక లెక్కలు అందరికీ అర్థమయ్యేలా సీఎం రేవంత్​వివరించారు.  ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 18,500 కోట్ల రూపాయలు కాగా, వాటిలో గత ప్రభుత్వం చేసిన అప్పులకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీకి, కిస్తులకు పోతున్నాయి. ఇక ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు 6,500 కోట్ల రూపాయలుపోగా, మిగిలిన 5000 కోట్ల రూపాయలతో  రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.  వృద్ధాప్య,  ఆసరా పెన్షన్లు,  వివిధ  ప్రభుత్వ కార్యక్రమాలకు  ఈ 5000 కోట్ల  రూపాయల నుంచే ఖర్చు చేయాలి. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలుసుకోకుండా  కొత్తగా డిమాండ్స్ చేయొద్దని,  కొత్త పథకాలకు డబ్బులు లేవని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చాలా స్పష్టంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. రాష్ట్ర ప్రజలు, ఉద్యోగులు కూడా  సీఎం రేవంత్​రెడ్డి చెప్పిన వాస్తవాలను  విశ్వసిస్తుంటే  కేసీఆర్​ నిప్పులు కక్కుతున్నారు.  తెలంగాణ ప్రజలపై అప్పుల భారం పెట్టిన మాజీ సీఎం కేసీఆర్​పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ  తెలంగాణ భవిష్యత్తును ఆశాజనకంగా సరిదిద్దుతున్న  సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వనికి మద్దతు పలుకుతున్నారు. 

మిస్​వరల్డ్ పోటీలతో పెట్టుబడులు

తెలంగాణలో జరుగుతున్న ప్రపంచ సుందరీమణుల కార్యక్రమం మీద ప్రతిపక్ష నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారు. మిస్ వరల్డ్​కార్యక్రమం గురించి హరీష్ రావు మాట్లాడుతూ పంటరాశులు కల్లాల్లో పెట్టి... అందాల రాశుల చుట్టూ సీఎం తిరుగుతున్నాడని అంటుండు.  కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి డబ్బులు లేవు కాని అందాల భామలకు డబ్బులు ఖర్చులు చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. యుద్ధం జరుగుతున్న సమయంలో అందాల పోటీలా.. మిస్​ వరల్డ్​ పోటీ రద్దు చేయండని కవిత వ్యాఖ్యలు,  ప్రపంచ అందాల భామల కాళ్లు కడిగించారని బీజేపీ, బీఆర్​ఎస్ నాయకుల దుష్ప్రచారం చేస్తున్నారు. 

  మే 10 నుండి 31 వరకు తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీకి 108 దేశాల నుంచి సుందరాంగులు.  దేశ విదేశాల నుంచి అతిథులు,  3 వేల మంది ఇతర దేశ పాత్రికేయులు హాజరయ్యే ప్రపంచ సుందరీమణుల పోటీని హైదరాబాద్ నగరానికే పరిమితం చేయకుండా,  రాష్ట్రంలోని టూరిజం స్పాట్​లను సెలెక్ట్ చేసి సుందరీమణులను ఆయా పర్యాటక ప్రదేశాలకు తీసుకువెళ్లి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేశారు. 

తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు

మే 10న గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి  అందాల పోటీలను ప్రారంభించిన తర్వాత మే 12న నాగార్జున సాగర్, బుద్ధవనం, ఆధ్యాత్మిక కార్యక్రమం. 13న చార్మినార్, లాల్ దర్వాజ గాజుల కొనుగోలు హెరిటేజ్ వాక్, చౌమహల్లా ప్యాలెస్,  మ్యూజిక్ హాల్, డిన్నర్. 14న వరంగల్ జిల్లాలోని వెయ్యి స్తంభాల గుడి సందర్శన, వరంగల్ కోట, రామప్ప గుడి సందర్శన. 15న యాదగిరి గుట్ట ఆలయం సందర్శన, పోచంపల్లి చేనేత వస్త్రాల ప్రదర్శనలను సుందరీమణులు సందర్శించడం జరిగింది. అదేవిధంగా16న పాలమూరు జిల్లాలోని 4 ఎకరాలలో విస్తరించిన పిల్లల మర్రిచెట్టు సందర్శన, రంగారెడ్డి జిల్లాలోని శంకర్​పల్లి మండలంలోని ప్రొద్దుటూరులోని ఎకో పార్క్ సందర్శన జరిగింది.

ఇంకా క్రీడలు,  రకరకాల కార్యక్రమాలు అందాల భామలతో పర్యటనలు చేయిస్తూ  ఈ నెల 31న మిస్ వరల్డ్ ను  ప్రకటిస్తారు. జూన్ 2న  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవం రోజున రాజ్ భవన్లో గవర్నర్  తేనిటీ విందుతో  ప్రపంచ సుందరీమణుల అందాల పోటీలు ముగుస్తాయి. తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల నుంచి పెట్టుబడులు రప్పించటానికి,  తెలంగాణ పర్యాటక ప్రాంతాలకు  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుటకు అందాల రాశులను అంబాసిడర్స్​గా మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రపంచ దేశాలన్నీ  తెలంగాణ వైపు చూసేలా చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి  విజయం సాధించాడు.

 మిస్ వరల్డ్​ కార్యక్రమంతో తెలంగాణ టూరిజం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది. ఈ అందమైన ప్రదేశాలకు ప్రపంచ దేశాలనుంచి టూరిస్టులు తెలంగాణకు వచ్చేవిధంగా చేసి తెలంగాణను టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్​ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్​ ప్రభుత్వ ప్రయత్నిస్తోంది.  పెట్టుబడులను ఆకర్షించి తద్వారా తెలంగాణను అప్పుల బారినుండి కాపాడాలని,  తెలంగాణను ఆర్థికంగా అభివృద్ధిలో ముందుకు తీసుకపోవడంలో సీఎం రేవంత్​ రెడ్డి విజయం సాధించాలని కోరుకుందాం. 

- దేవని 
సతీష్ మాదిగ,
కాంగ్రెస్ పార్టీ నాయకుడు