ధరణిలో భూములు మాయం.. రాష్ట్రంలో15 లక్షల సర్వే నంబర్లు మిస్సింగ్​!

ధరణిలో భూములు మాయం.. రాష్ట్రంలో15 లక్షల సర్వే నంబర్లు మిస్సింగ్​!
  • రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల సర్వే నంబర్లు మిస్సింగ్​!
  • ఎర్రవల్లిలోనే 150కి పైగా నంబర్లు గల్లంతు
  • కనిపించని భూములపై దరఖాస్తు చేసుకునే ఆప్షన్ తీసేసిన సర్కారు
  • కలెక్టర్లను కలిసి 
  • అప్లై చేసుకోవాల్సిందే
  • మీసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్న రైతులు

హైదరాబాద్, వెలుగు: ధరణి వెబ్​సైట్​లో భూముల వివరాలు మాయమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది సర్వే నంబర్లు కనిపించకుండా పోయాయి. ధరణి పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య సిద్దిపేట జిల్లాలో చేయించిన సర్వేలో ఈ నిజం బయటపడింది. ఈ ఒక్క జిల్లాలోనే దాదాపు 35 శాతం సర్వే నంబర్లు గల్లంతైనట్లు వెల్లడైంది. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి ఉండటంతో లక్షల్లో సర్వే నంబర్లు గల్లంతైనట్లు అధికారులే చెబుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఫిర్యాదులు, వేలాది మంది రైతులు మీ సేవా కేంద్రాలు, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. గతంలో ప్రభుత్వం నిర్వహించిన మా భూమి, వెబ్​ల్యాండ్, ఐఎల్ఆర్ఎంఎస్, టీల్యాండ్ పోర్టల్స్​లో కనిపించిన చాలా సర్వే నంబర్లు, బై నంబర్లు ధరణిలో మాయమయ్యాయి. ధరణిలోని ల్యాండ్ డీటైల్స్ సెర్చ్ ఆప్షన్​లో భూముల వివరాల కోసం వెతికితే పాస్​బుక్స్​ ఇవ్వని భూముల వివరాలు కనిపించడం లేదు. కొత్త పట్టాదారు పాస్​బుక్స్​లో ఉన్న లక్షలాది సర్వే నంబర్లు మాయమయ్యాయి. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.కొత్త పాస్ బుక్ లో ఉండి.. ధరణి లో కనిపించకుండా పోయినా సర్వే నంబర్స్ రావడం లేదు. దీంతో ఈ నంబర్లను తమ పేరిట నమోదు చేయాలని భూమి యజమాని అప్లై చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ధరణిలో సర్వే నంబర్ లేకుంటే సవరించే అధికారం తహసీల్దార్లకు లేదు. దీంతో రైతులు నేరుగా కలెక్టర్​కు దరఖాస్తు చేసుకొని.. కలెక్టరేట్​ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.

సర్కార్​కు భూములిచ్చి అవస్థలు

భూదానోద్యమం, సీలింగ్ యాక్ట్ లో భాగంగా సర్కార్ కు అప్పగించగా పోనూ మిగిలిన భూములు యజమానుల దగ్గరే ఉన్నాయి. అయితే వారిచ్చిన భూములు ప్రభుత్వ పరం కావడంతో సదరు సర్వే నంబర్లలో ఉన్న మొత్తం ల్యాండ్​ను ధరణి పోర్టల్​లో ‘ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ’ లిస్టులో చేర్చారు. దీంతో సర్కారుకు ఇచ్చింది పోగా యజమానులకు మిగిలిన సొంత భూములు కూడా నిషేధిత జాబితాలో చేరాయి. ‘‘నాకో వంద ఎకరాలు ఉన్నాయి. 25 ఎకరాలను సీలింగ్ కింద ప్రభుత్వానికి అప్పగించాను. ఇప్పుడు మొత్తం వంద ఎకరాలు ప్రొహిబిటెడ్ జాబితాలో పడ్డాయి’’ అని స్వయంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారు. ఇరిగేషన్, ఇతర ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన వాళ్ల పరిస్థితి ఇలాగే మారింది.

రికార్డులు మార్చి ఆగం చేసిన్రు

ధరణి పోర్టల్ కు ముందు భూరికార్డుల ప్రక్షాళన సమయంలో ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్​మెంట్ సిస్టం(ఐఎల్ఆర్ఎంఎస్) పోర్టల్ నిర్వహించారు. అంతకుముందు ఉమ్మడి ఏపీలో 2011లో ‘మా భూమి’ పేరిట పోర్టల్, వెబ్​ల్యాండ్, 2016లో మా భూమి పోర్టల్, టీల్యాండ్ పేరుతో ఆన్​లైన్ భూరికార్డులు నిర్వహించారు. ఈ పోర్టల్స్​లో భూమి సర్వే నంబర్, పహాణీ, టిప్పన్, ఆర్వోఆర్1బీ, గ్రామ పటం చూసుకునే వీలుండేది. ఈ క్రమంలోనే భూ రికార్డుల ప్రక్షాళన పేరిట పాత పాస్ బుక్స్​ను రద్దు చేసి కొత్త పాస్​బుక్స్​ను ఇచ్చిన ప్రభుత్వం.. ఈ డేటాను ఐఎల్ఆర్ఎంఎస్ పోర్టల్ లో పొందుపరిచింది. ఇందులో ఆర్వోఆర్, వన్ బీ, గ్రామనక్షలు, అమెండ్​మెంట్ రిజిస్టర్, పహాణీ, పార్ట్​ బీలో చేర్చి పాస్​బుక్స్ జారీ చేయని పెండింగ్ సర్వే నంబర్లు, తదితర సమగ్ర భూరికార్డులు ప్రజలకు కనిపించేవి. అయితే ధరణి పోర్టల్ రాగానే సీసీఎల్ఏ వెబ్ సైట్ లోని భూరికార్డుల సమాచారాన్ని తొలగించారు. పక్కా హక్కుల రికార్డుగా తీసుకొచ్చిన ధరణిలో లక్షలాది సర్వే నంబర్లు ఎగిరిపోవడంతో సమస్య భూరికార్డుల సమస్య మళ్లీ మొదటికొచ్చినట్లయింది.

ఆప్షన్​ కనిపిస్తలేదు

సర్వే నంబర్ మిస్సయి భూములు తమ పేరు మీదకు రాని రైతులు మీ సేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకుంటే చెక్ చేసి, పాస్​బుక్స్ జారీ చేస్తామని నెల రోజుల క్రితం సీసీఎల్ఏ సర్క్యులర్ జారీ చేసింది. ధరణిలో ఆప్షన్ కూడా ఇచ్చింది. అయితే ఇందులో కేవలం తహసీల్దార్ డిజిటల్ సైన్ కాని సర్వే నంబర్స్ లిస్ట్ మాత్రమే వస్తోంది. 

అమ్మలేం.. వారసులకు ఇవ్వలేం..

రమేశ్​కు ఐదెకరాల భూమి ఉంది.. పట్టాదారు పాస్ పుస్తకం ఉంది.. రైతు బంధు సాయం కూడా బ్యాంకు ఖాతాలో జమవుతోంది. కానీ ఆయన సర్వే నంబర్ ధరణి వైబ్​సైట్​లో కనిపించడం లేదు. ఇట్ల లక్షల మందికి చెందిన భూములు మాయమయ్యాయి. దీని వల్ల ఆ భూమిని ఇతరులకు అమ్ముకునేందుకు వీలుండదు. వారసులకు ఇవ్వలేరు. అసలు ఆ భూమిపై హక్కులే ప్రశ్నార్థకమవుతాయి.

పట్టాలో ఎక్కలే

మహబూబ్​నగర్ జిల్లా కోయిల్​కొండ మండలం మల్కపూర్ వాసి భద్రుకు ఊర్లో సర్వే నంబర్ 159, 161, 174లో ఒక ఎకరా 13 గుంటల భూమి ఉండేది. కొత్త పాసు బుక్ ప్రకారంa 10 గుంటలు మాత్రమే రికార్డుల్లో ఎక్కింది. మిగతా భూమిని ఆయన పేర చేయాలని ధరణిలో అప్లికేషన్ పెట్టగా సర్వే నంబర్లు మిస్​ అయ్యాయని చెప్పారు. ఆ భూమి కోసం ధరణి వచ్చినప్పటి నుంచి ఆయన తిరుగుతున్నా పరిష్కారం కావట్లేదు. 

సర్వే నంబర్లు ఏమైనట్లు?

ఒక్కో గ్రామంలో వివిధ కారణాలతో క్లియరెన్స్ కోసం పెండింగ్​లో పెట్టిన సర్వే నంబర్లు, బై నంబర్లు 100 నుంచి 300 వరకు ఉంటాయి. సీఎం ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవల్లిలోనే సుమారు 150కిపైగా నంబర్లను అప్పట్లో ​పెండింగ్​లో పెట్టారు. ధరణి వచ్చాక అప్పటి వరకు సీసీఎల్ఏ వెబ్​సైట్​లో ఉన్న సర్వే నంబర్ ‘పెండింగ్ ఫర్ క్లియరెన్స్’ అనే జాబితాను కూడా తొలగించారు. ఇలా రాష్ట్రంలోని 10 వేల పైచిలుకు రెవెన్యూ గ్రామాల్లో సుమారు 15 లక్షల సర్వే నంబర్లు మిస్సింగ్ జాబితాలో ఉన్నాయని అంచనా. రికార్డుల్లో కనిపించకపోయే సరికి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అసలు ఆ భూములు తమ పేరు మీద వస్తాయో, లేదోనని, పాస్‌ పుస్తకాలు ఇస్తారో, లేదోనని భయపడుతున్నారు.

ఆఫీసు చుట్టూ తిరుగుతున్నం

ఆదిలాబాద్ జిల్లాలోని మాదాపూర్‌‌లో సర్వే నంబర్ 24/35 యజమాని కాటిపెల్లి సాంబయ్య మృతి చెందారు. ఆయన కొడుకు జగదీశ్వర్ రెడ్డికి విరాసత్ చేయించుకోడానికి వెళ్తే భూమి చూపించట్లే దు. స్లాట్ బుక్ కావట్లేదు. ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దాబా గ్రామంలో జాదవ్ శివలాల్ అనే రైతు మృతిచెందాడు. ఆయనకు 1/23 సర్వే నంబర్​లో భూమి ఉండేది. ఆయన ఇద్దరు కుమారులు తమ పేరిట పట్టా చేయించుకోవాలని వెళ్తే సర్వే నంబర్ కనిపించడం లేదు.

ఎకరం వివరాల్లేవ్

నాకు వారసత్వంగా వచ్చిన రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని మా తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నం. కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన తర్వాత ఎకరం మాయమైంది. నాలుగు నెలలుగా ఎమ్మార్వో ఆఫీసు చుట్టు తిరిగినా దాటవేస్తున్నరు. భూమి పట్టా ఎక్కించడం లేదు. ఈ రందితోనే నా భార్య చనిపోయింది. సమస్య పరిష్కరించాలి.
- సాయిలు, బొనకొల్లూరు, బచ్చన్న పేట మండలం, జనగామ జిల్లా

14 గుంటలు కనిపిస్త లేదు

గన్నేరువరం శివారులో నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. సర్వే నంబర్ 28 లో నాకున్న 14 గుంటల భూమి ధరణి లో రావడం లేదు. ఇప్పటికి నేనే కాస్తులో ఉన్నా. మ్యాన్యువల్ పహాణీలో ఉన్నప్పటికీ కొత్త పాస్ పుస్తకంలో  రాకపోవడంతో రైతుబంధు రావడం లేదు. పంట పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్నాం. ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నా పని కావడం లేదు.
- జాలి వీరయ్య, గన్నేరువరం, కరీంనగర్ జిల్లా