9 ఏండ్ల కింద బాలిక కిడ్నాప్

9 ఏండ్ల కింద బాలిక కిడ్నాప్

ముంబై: ఓ వ్యక్తి తమకు పిల్లలు లేరని ఓ బాలికను కిడ్నాప్ చేశాడు. తొమ్మిదేండ్ల తర్వాత ఇంటర్నెట్​లో దొరికిన పోస్టర్​ ఫొటో ద్వారా ఆ యువతి తిరిగి తన తల్లి వద్దకు చేరింది. ముంబైలోని అంధేరిలో ఈ ఘటన జరిగింది. అంధేరి శివారు ప్రాంతానికి  చెందిన పూజ అనే ఏడేండ్ల బాలిక 2013లో సోదరుడితో కలిసి స్కూలుకు వెళ్లింది. స్కూలు వద్ద హెన్రీ జోసెఫ్ డిసౌజా అనే వ్యక్తి ఆ బాలికను మభ్యపెట్టి కిడ్నాప్ చేశాడు. ఆమె పేరు యానీ  డిసౌజాగా మార్చి, కర్నాటకలోని ఓ హాస్టల్​లో చేర్పించాడు.

కొన్నాళ్లకు జోసెఫ్​ దంపతులకు బిడ్డ పుట్టడంతో పూజను ఇంటికి తీసుకొచ్చి పనిమనిషిలా ఉపయోగించుకుంటున్నారు. పూజ ప్రస్తుతం పదహారేండ్ల యువతి.  ఆమె తండ్రి కొన్నేండ్ల కిందే చనిపోగా తల్లి, సోదరుడు ఉన్నారు. అయితే, ఓ రోజు మద్యం మత్తులో ఇంటికొచ్చిన జోసెఫ్​.. పూజకు అసలు విషయం చెప్పాడు. దీంతో ఫ్రెండ్​తో కలిసి ‘‘పూజ మిస్సింగ్’’ అనే పదాలతో ఆమె ఇంటర్నెట్​లో వెతికింది. పాత మిస్సింగ్ పోస్టర్ దొరికింది. అందులోని నంబర్​కు ఫోన్ చేయగా.. సమాచారం దొరికింది. పోలీసుల సాయంతో పూజ తల్లి వద్దకు చేరింది.  జోసెఫ్​ దంపతులను అరెస్ట్ చేశారు.