
- 8,066 మంది బాలికలు కూడా..
- 2019-–-21 మధ్య లెక్కలను రాజ్యసభలో వెల్లడించిన
- కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా
- ఏపీలోనూ 22,278 మంది మహిళలు మిస్సయినట్లు ప్రకటన
న్యూఢిల్లీ, వెలుగు : 2019 నుంచి 2021 మధ్య తెలంగాణలో 8,066 మంది బాలికలు, 34,495 మంది మహిళలు తప్పిపోయారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2021 లో అత్యధికంగా 2,994 మంది బాలికలు, 12,834 మంది మహిళలు తప్పిపోయారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తెలిపారు. బుధవారం రాజ్యసభలో ఎన్సీపీ ఎంపీ ఫౌజియా ఖాన్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2019–2021 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 2,51,430 మంది బాలికలు, 10,61,648 మంది మహిళలు తప్పిపోయినట్లు కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లో అత్యధికంగా మిస్సింగ్ కేసులు రికార్డు అయ్యాయని పేర్కొన్నారు. మిజోరం, లక్షద్వీప్ లో ఒక్క మిస్సింగ్ కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. ఇక ఏపీలో 7,918 మంది బాలికలు, 22,278 మంది మహిళల మిస్సింగ్ కేసులు రికార్డు అయ్యాయని వివరించారు.