అడవిలో తప్పిపోయిన నలుగురు మహిళల జాడజూపిన డ్రోన్లు

అడవిలో తప్పిపోయిన నలుగురు మహిళల జాడజూపిన డ్రోన్లు

నిర్మల్, వెలుగు: తునికాకు కోసం అడవిలోకి వెళ్లిన నలుగురు మహిళా కూలీలు దారి తప్పిపోయారు. ఉదయం వెళ్లిన వాళ్లు రాత్రైనా రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మూడు స్పెషల్ పార్టీ బృందాలు రాత్రంతా వెతికినా వారి ఆచూకీ తెలియరాలేదు. చివరికి డ్రోన్ సహాయంతో వాళ్లను గుర్తించి సేఫ్​గా ఇంటికి తీసుకొచ్చారు. 

ఈ ఘటన నిర్మల్ జిల్లా మామడ మండలం కప్పనపల్లి గ్రామంలో చోటు చేసుకున్నది. రాజుల రాధా, కంబాల లింగవ్వ, బత్తుల సరోజ, గట్లమీది లక్ష్మి రోజుమాదిరిగానే గురువారం తునికాకు సేకరణ కోసం అడవిలోకి వెళ్లారు. చివరికి తిరిగి వచ్చే దారి మర్చిపోయారు. సాయంత్రంలోగా ఇంటికి చేరుకునే వీళ్లు.. రాత్రైనా రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనపడ్డారు. రాత్రి 8 గంటలైనా వారి జాడ తెలియకపోవడంతో మామడ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాళ్లు ఎస్పీ జానకి షర్మిల దృష్టికి తీసుకెళ్లారు. ఏఎస్పీ రాజేశ్ మీనాతో కలిసి ఆమె మామడ పోలీస్ స్టేషన్​కు చేరుకున్నారు. మూడు స్పెషల్ పార్టీ టీమ్​లు, మహిళా పోలీస్ సివంగి బృందాలను ఎస్పీ రంగంలోకి దించారు. 

రాత్రంతా వెతికినా నలుగురు మహిళల ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం డ్రోన్ల సహాయంతో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. నలుగురు మహిళలు దట్టమైన అడవిలో ఉన్న భీమన్న గుట్టపై భయంభయంగా కనిపించారు. స్పెషల్ పార్టీ బృందాలను వెంటనే అక్కడికి పంపించి మహిళలను అడవి నుంచి బయటికి తీసుకొచ్చారు. ఉద్వేగానికి గురైన మహిళలు.. ఎస్పీ జానకి షర్మిలను హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఊరు పొలిమేర నుంచి పూలతో నలుగురు మహిళలకు గ్రామస్తులు స్వాగతం పలికి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తునికాకు ఏరుకుంటూ అడవిలోకి వెళ్లిపోయాయని, అసలు బతికి బయటపడ్తామని అనుకోలేదని రాజుల రాధ తెలిపింది. అడవిలోని దారులన్నీ తెలిసినప్పటికీ తప్పిపోయామని చెప్పింది. చివరికి ఓ గుట్టమీదే రాత్రంతా కూర్చుండిపోయామన్నారు. పోలీసులే దేవుళ్ల మాదిరి వచ్చి కాపాడారని వివరించారు. రాత్రంతా నిద్రలేకుండా గడిపామని కంబాల లింగవ్వ తెలిపింది.