ఆమె ఒక ఒంటరి మహిళ. భర్త చనిపోవడంతో... ఎన్నో ఇబ్బందులు పడుతూ బతుకుతోంది. అందుకే ఆమె గురించి తెలిసినవాళ్లంతా ‘అయ్యో పాపం’ అని జాలి పడేవాళ్లు. కానీ.. ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. అసలు విషయం తెలిస్తే.. ఆశ్చర్యపోతారు. అమాయకురాలిలా కనిపించే ఈ మిస్టీరియస్ లేడీ... 14 మందిని దారుణంగా చంపిన సీరియల్ కిల్లర్. అంతేకాదు.. మరో 28 మర్డర్లు కూడా చేసిందట. ఈ మర్డర్లను పోలీసులు గుర్తించనేలేదు.
ఆమె పేరు బెల్లె గన్నెస్.19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం మొదట్లో అమెరికాలోని మిడ్‌వెస్ట్ ప్రాంతంలో ఒంటరిగా బతికిన వితంతువు. ఆమె ఎవరిని పెండ్లి చేసుకున్నా కొంతకాలానికి ఏదో ఒక ప్రమాదంలో వాళ్లు చనిపోయేవాళ్లు. అందుకే ఆమె మీద అందరూ జాలి చూపించేవాళ్లు. కానీ.. ఆమె చనిపోయేనాటికి తెలిసింది ఏంటంటే.. ఆమె తన భర్తలు, పిల్లల్ని చంపిన హంతకురాలని. అయ్యో! అదేంటి అలా అందర్నీ ఎందుకు చంపింది? అంటున్నారా. అది తెలియాంటే.. ఆమె కథ తెలుసుకోవాలి.
మొదటి ఫ్యామిలీ
బెల్లె గన్నెస్ 1859 నవంబర్ 11న నార్వేలోని సెల్బులో పుట్టింది.1881లో సెల్బు నుంచి చికాగోకు వలస వెళ్లింది. అక్కడామెకు డిట్లేవ్ ఆంటోన్ సోరెన్సన్ పరిచయం అయ్యాడు. అతనితో ప్రేమలో పడి, 1884లో పెండ్లి చేసుకుంది. చాలా కాలం హాయిగానే ఉన్నారు. ఇద్దరూ కలసి క్యాండీ షాప్ పెట్టారు. కానీ, కొన్నాళ్లకే అగ్నిప్రమాదం జరిగి ఆ షాపు కాలిపోయింది. దానికి ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ అయ్యింది. వాళ్లకు అప్పటికే నలుగురు పిల్లలు. కానీ.. వాళ్లలో ఇద్దరు చనిపోయారు.
పెద్ద పేగుకు వ్యాధి సోకి చనిపోయారని అందరికీ చెప్పింది.1900వ సంవత్సరంలో వాళ్ల ఇల్లు కాలిపోయింది. అప్పుడు కూడా గన్నెస్, సోరెన్సన్లకు ఇన్స్యూరెన్స్ డబ్బు అందింది. ఆ తర్వాత అదే ఏడాది జులై 30న వాళ్లింట్లో మరో మరో విషాదం జరిగింది. సోరెన్సన్ అనుకోకుండా చనిపోయాడు. ఇవన్నీ చదువుతుంటే కాస్త తేడాగా అనిపిస్తుంది కదా. కానీ, అప్పట్లో సోరెన్సన్ చావు మీద ఎవరికీ అనుమానం రాలేదు. గన్నెస్ అంతబాగా మేనేజ్ చేసింది.
‘‘సోరెన్సన్ తలనొప్పితో ఇంటికి వచ్చాడు. అతనికి క్వినైన్ ఇచ్చాను. తరువాత కాసేపటికే చనిపోయాడు” అని అందరికీ చెప్పింది గన్నెస్. విచిత్రం ఏంటంటే.. అతను చనిపోయిన రోజు సోరెన్సన్ తీసుకున్న పాత లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ వర్తించే చివరి రోజు. కొత్త పాలసీ మొదలయ్యే మొదటి రోజు. అంటే ఆ రోజు చనిపోతే.. రెండు పాలసీలు కవర్ అవుతాయి. దాంతో గన్నెస్కు రెండు పాలసీల డబ్బు దాదాపు 1,50,000 అమెరికన్ డాలర్లు వచ్చింది. ఆ డబ్బుతో గన్నెస్ ఇండియానాలోని లా పోర్టేలో 48 ఎకరాల పొలం కొన్నది. అక్కడే తన కూతుళ్లు మిర్టిల్, లూసీతోపాటు జెన్నీ ఒల్సేన్ అనే పెంపుడు కూతురితో కలిసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది.
రెండో ఫ్యామిలీ
భర్త చనిపోయి కూతుళ్లతో కలిసి బతుకుతున్న గన్నెస్కు కొత్త జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో 1902 ఏప్రిల్‌లో పీటర్ ఆమెని పెండ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమె జీవితంలో మళ్లీ విషాదం ఎదురైంది. పీటర్‌కి తన మొదటి భార్యకు పుట్టిన కూతురు చనిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకే పీటర్ కూడా చనిపోయాడు. షెల్ఫ్‌లో ఉన్న గ్రైండర్ అతని తలపై పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దీన్ని కూడా అందరూ ప్రమాదం అనే అనుకున్నారు. అయితే.. గన్నెస్ చాలా బలవంతురాలని ఆమె ఫామ్‌లో పనిచేసేవాళ్లు చెప్తుండేవాళ్లు. ఆమె 300 పౌండ్ల బరువు ఉన్న పియానోను ఒక్కతే ఎత్తడం చూశామని కూడా చెప్పారు. అంత పెద్ద పియానో ఎత్తిన గన్నెస్కు గ్రైండర్ ఎత్తడం పెద్ద కష్టమేమీ కాదు.
పీటర్ చనిపోయాక గన్నెస్ చాలాకాలం అతని జ్ఞాపకాలతోనే బతికింది. తర్వాత అతను చనిపోయాక వచ్చిన ఇన్స్యూరెన్స్ పాలసీ డబ్బుతో బతికింది.
ఇంత జరుగుతున్నా.. గన్నెస్ మీద ఎవరికీ అనుమానం రాలేదు. ఆమె ఈ చావులకు కారణమని ఎవరూ అనుమానించలేదు. కానీ.. తన పెంపుడు కూతురికి మాత్రం ఒకట్రెండు సార్లు గన్నెస్ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆమె కూడా కనిపించకుండా పోయింది.
మూడోసారి..
బెల్లె గన్నెస్కు డబ్బు అవసరం మళ్లీ వచ్చినట్టుంది. ముచ్చటగా మూడోసారి మూడో హత్యకు ప్లాన్ చేసింది. అందుకోసం గన్నెస్ కొత్త భర్తను వెతికే పనిలో పడింది. అందులో భాగంగానే నార్వేజియన్ లాంగ్వేజ్ న్యూస్ పేపర్లలో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చింది. అందులో తన ఆస్తుల వివరాలు కూడా స్పష్టంగా చెప్పింది. పైగా.. ‘‘ఈ అందమైన విడోను దక్కించుకోవాలి అనుకునేవాళ్లు నేరుగా సంప్రదించాలి. ఉత్తరాలు రాస్తే.. ప్రత్యుత్తరాలు ఉండవు” అని కండిషన్లు కూడా పెట్టింది.
దాంతో ఆమె ఆస్తికి ఆశపడిన కొందరు బ్యాచిలర్స్ వాళ్ల కుటుంబాలను వదిలేసి మరీ గన్నెస్ దగ్గరికి వచ్చారు. ఆమె ఇంటికి వచ్చిన మగవాళ్లలో ఎవరికీ ఎక్కువ రోజులు ఆనందంగా గడిపే అదృష్టం లేదు. ఖర్చుల కోసం తెచ్చుకున్న కొన్ని వేల డాలర్లతో సహా వాళ్లు కూడా కనిపించకుండా పోయారు. వాళ్లు ఏమయ్యారు? ఎక్కడికి వెళ్లారు? అనే విషయం ఎవరికీ తెలియదు. వాళ్లలో జార్జ్ ఆండర్సన్ అనే వ్యక్తి మాత్రం ఆమె నుంచి తప్పించుకుని బయటపడ్డాడు.
అతను కూడా అందరిలాగే డబ్బు మీద ఆశతో మిస్సౌరీ అనే ప్రాంతం నుంచి గన్నెస్ ఫామ్‌కు వచ్చాడు. కానీ.. అతను ఒక రాత్రి గన్నెస్ కళ్లలో ఆవేశాన్ని చూశాడు. ఆమె ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు గమనించాడు. దాంతో వెంటనే అక్కడ్నించి వెళ్లిపోయాడు. ఆండర్సన్ తర్వాత కూడా చాలామంది ఆ ఇంటికొచ్చి మాయమయ్యారు. ఆమె పొలంలో పనిచేసేవాళ్లలో ఒకరు ‘‘గన్నెస్ ఇంటికి కొన్నిసార్లు వారానికి ఒకరు చొప్పున వచ్చేవాళ్లు. వాళ్లు తన కజిన్స్ అని, కన్సాస్, సౌత్ డకోటా, విస్కాన్సిన్, చికాగోల నుంచి వచ్చారని పరిచయం చేసేది. తన పిల్లల్ని వాళ్లకు దూరంగా ఉంచేది” అని చెప్పారు.
ఇలా దొరికిపోయింది
బెల్లె గన్నెస్ నిజస్వరూపం చివరగా తన దగ్గరకు వచ్చిన ఆండ్రూ హెల్గెలియన్ వల్ల తెలిసింది. అతను నార్వేజియన్ న్యూస్ పేపర్ ‘మిన్నియాపాలిస్ టిడెండే’లో యాడ్ చూసి గన్నెస్కు లెటర్ రాశాడు. ఎప్పుడూ లెటర్లకు బదులు ఇవ్వని గెన్నెస్ ఇతనికి మాత్రం ప్రత్యుత్తరాలు రాసింది. ‘‘మీరు ఒకసారి ఇక్కడికి వస్తే నేను చాలా సంతోషిస్తా. మీ కోసం నా హృదయం ఎదురు చూస్తోంది. నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఎప్పటికీ ఇక్కడే ఉండటానికి వచ్చేయండి” అని లెటర్ రాసింది. ఆ లెటర్ చదివిన ఆండ్రూ ఆమెతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాడు.
1908 జనవరి 3న గన్నెస్ ఫామ్‌కి వెళ్లాడు. ఆ తర్వాత అతను కూడా అదృశ్యమయ్యాడు. అయితే.. ఆండ్రూ ఎక్కడున్నా తన తమ్ముడు అస్లేకు రెగ్యులర్‌గా ఉత్తరాలు రాసేవాడు. అస్లే రాసిన లెటర్లకు రిప్లై ఇచ్చేవాడు. కానీ.. ఒక్కసారిగా అస్లేకు లెటర్లు రావడం ఆగిపోయింది. అతను లెటర్లు రాసినా రిప్లై రావడం లేదు. కొన్ని రోజులకు గన్నెస్ అస్లేకు ఒక లెటర్ రాసింది. అందులో ‘‘మీ అన్న ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. బహుశా చికాగోకు వెళ్లి ఉండవచ్చు” అని ఉంది.
అదే టైంలో లాంఫేర్ అనే రైతు గన్నెస్ను ప్రేమించాడు.
వీళ్లిద్దరి మధ్య సంబంధం ఉందని చుట్టుపక్కల వాళ్లు అనుకునేవాళ్లు. అయితే.. గన్నెస్ దగ్గరికి ఆండ్రూ వచ్చిన తర్వాత లాంఫేర్ అసూయతో ఆమె ఇంటికి రావడం మానేశాడు.1908 ఏప్రిల్ 27న బెల్లె గన్నెస్ లా పోర్టేలో ఒక లాయర్ని కలిసి, లాంఫేర్ వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పింది. ఆ తర్వాత తన పిల్లలకు కొన్ని బొమ్మలు, రెండు గ్యాలన్ల కిరోసిన్ కొనుక్కొని ఫామ్‌హౌజ్‌కి వెళ్లిపోయింది. ఆ మరుసటి రోజు ఫామ్‌హౌజ్ కాలిపోయింది. శిథిలాల్లో గన్నెస్ పిల్లల శవాలు దొరికాయి. వాళ్లతోపాటు తల లేని మహిళ శవం కూడా దొరికింది. అందరూ అది గన్నెస్దే అనుకున్నారు. కానీ.. అందుకు తగ్గ ఆధారాలు మాత్రం లేవు. వెంటనే లాంఫేర్‌ని అరెస్ట్ చేశారు.
అతనే తగలబెట్టాడని కేసు నమోదు చేశారు. అయితే.. న్యూస్ పేపర్లో ఈ వార్త చదివిన అస్లే తన అన్న ఆండ్రూని వెతుకుతూ గన్నెస్ ఇంటికి వచ్చాడు. తన అన్న శవం కూడా దొరుకుతుందేమో అనే ఆశతో శిథిలాల కింద వెతకడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ ఇంటి అడుగున 11 బస్తాలు దొరికాయి. వాటిలో శరీరాలను కోసి వేరు చేసిన భుజాలు, చేతులు ఉన్నాయి. కొన్ని బస్తాల్లో బాడీ పార్ట్స్ బాగా కుళ్లిపోయాయి. వాటిలో ఆండ్రూస్ శరీర భాగాలు కూడా దొరికాయి. అప్పుడే బెల్లె గన్నెస్ గురించి అందరికీ తెలిసింది. పేపర్లలో ఆమె గురించి ‘బ్లాక్ విడో’, ‘ఇండియానా ఆగ్రెస్’, ‘మిసెస్ ఆఫ్ ది కాజిల్ ఆఫ్ డెత్’ అని రాశారు. కొందరు ఆ ఇంటిని ‘హారర్ ఫామ్’ అన్నారు.
గన్నెస్ చనిపోయిందా?
గన్నెస్ గురించి అందరికీ తెలిసింది. కానీ.. ఆమె చనిపోయిందా? లేదా? అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీనే. ఫామ్‌హౌస్‌లో దొరికిన తల లేని శవం గన్నెస్దేనా? కాదా? అని అధికారులు నిర్ధారించలేకపోయారు. పైగా ఆ బాడీ కూడా గన్నెస్తో పోలిస్తే చాలా చిన్నగా ఉంది. అందుకే గన్నెస్ గురించి లోకానికి తెలిసే టైంకి తనను తాను కాపాడుకోవడానికి తన పిల్లల్ని చంపి, తాను కూడా చనిపోయినట్టు నాటకం ఆడిందని చాలామంది వాదించారు. ఆమె మళ్లీ ఎక్కడో ఒక చోట తన వేట మొదలుపెట్టి ఉంటుందని కూడా అనుకున్నారు.
సరిగ్గా అనుమానాలను నిజం చేస్తూ.. ఆమె మళ్లీ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. 1931లో లాస్ ఏంజెలెస్‌లో ఒక నార్వేజియన్-–అమెరికన్ వ్యక్తికి విషం ఇచ్చి అతని డబ్బును దొంగిలించడానికి ట్రై చేసి నందుకు ఎస్తేర్ కార్ల్‌సన్ అనే మహిళను అరెస్టు చేశారు. ఆమె అచ్చం గన్నెస్లాగే ఉంది. కానీ.. విచారణ జరుగుతుండగానే ఆమె క్షయ వ్యాధితో చనిపోయింది. ఆ తర్వాత జైలులో లాంఫేర్.. తాను కూడా గన్నెస్ హత్యలు చేయడంలో సాయం చేశానని, ఆమె మొత్తం 42 మందిని చంపిందని తోటి ఖైదీతో చెప్పాడు.
