ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

రామకృష్ణాపూర్,వెలుగు: ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలద్రోయడంలో కేంద్రంలోని అధికార పార్టీలు గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్​ ఆరోపించారు. శనివారం రామకృష్ణాపూర్ మున్సిపాలిటీలోని సీపీఐ ఆఫీస్​లో నిర్వహించిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గవర్నర్​వ్యవస్థను కొనసాగించడం సరికాదన్నారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 7న ‘చలో రాజభవన్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సెక్రటరీ రామడుగు లక్ష్మణ్, ఏఐటీయూసీ జిల్లా ప్రెసిడెంట్​ఎండీ అక్బర్ అలీ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పకాయల లింగయ్య, రేగుంట చంద్రశేఖర్, భీమనాధుని సుదర్శనం, మేకల దాస్, వనం సత్యనారాయణ, రామకృష్ణాపూర్, మందమర్రి టౌన్ సెక్రటరీలు మిట్టపెల్లి శ్రీనివాస్, కామెర దుర్గారాజు, జిల్లా సమితి మెంబర్లు పౌల్, ఈరవేన రవీందర్, కమలమ్మ, వెంకటస్వామి, వజ్ర, పద్మ  పాల్గొన్నారు.

పద్మశ్రీ కనక రాజుకు ఇంటి పేపర్ల అందజేత

ఆసిఫాబాద్,వెలుగు: జైనూర్​మండలం మార్లవాయి గ్రామానికి చెందిన పద్మశ్రీ గుస్సాడీ కనకరాజుకు శనివారం బొలెరో వెహికల్, ఇంటి స్థలం పేపర్లు అందజేశారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్​ రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్​ రాహుల్​ రాజ్, ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్​పేయ్, జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు సక్కు, కోనప్ప వాటిని కనకరాజుకు ఇచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలను చైతన్య పర్చడంలో కళాకారుల పాత్ర గొప్పదన్నారు. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన కనకరాజు జిల్లావాసి కావడం గర్వకారణమన్నారు. డీటీడీవో మణెమ్మ, జీసీడీవో శకుంతల తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ ఆఫీసర్లను అడ్డుకున్న రియల్టర్లు

భైంసా,వెలుగు: భైంసా మండలం ఖథ్గాం శివారులో శనివారం వేదం స్కూల్ పక్కన వెలిసిన వెంచర్ల హద్దులు తొలగించేందుకు వచ్చిన ఆఫీసర్లను రియల్టర్లు అడుకున్నారు. కలెక్టర్ ఆదేశాల కాపీ చూపించాలని డిమాండ్​చేశారు. ఏళ్లుగా లేని రూల్స్ ఇప్పటికిప్పుడు ఎలా వచ్చాయని? తమకు అన్యాయం చేయొద్దన్నారు. కలెక్టర్ వచ్చి సమస్య తెలుసుకోవాలని, ఎన్నిసార్లు కలెక్టర్​ఆఫీసుకు వెళ్లినా తమను పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా నిర్మల్​జిల్లాలోనే వెంచర్లను ఎందుకు తొలగిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కలెక్టర్ వచ్చేవరకు వెంచర్లను తొలగించేది లేదని తేల్చిచెప్పడంతో ఆఫీసర్లు చేసేదేమిలేక వెనుదిరిగారు. రెండ్రోజుల్లోగా సమస్య పరిష్కరించాలని, లేదంటే రియల్​ఎస్టేట్​వ్యాపారులమంతా కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఒక్కో వెంచర్​కోసం లక్షలు ఖర్చుచేశామని, అక్రమం అంటూ ఇప్పుడు తొలగిస్తే నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితిలో తమకు ఆత్మహత్యలే దిక్కని రియల్టర్లు అర్వింద్, సంతోష్ తదితరులు పేర్కొన్నారు.

ఎన్నికలకు రెడీగా ఉండాలె

ఆదిలాబాద్,వెలుగు: బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు ఎన్నికలొచ్చినా రెడీగా ఉండాలని గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్ కోరారు. శనివారం ఆదిలాబాద్ లోని పార్టీ ఆఫీసులో నిర్వహించిన గిరిజన మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్​గిరిజనులకు ఇస్తామన్న గిరిజన బంధు, మూడు ఎకరాల భూమి ఇంతవరకు జాడలేదన్నారు. పార్టీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు మరప రాజు, రాష్ట్ర కార్యదర్శి కుమ్ర దౌలత్, లీడర్లు వేణుగోపాల్, ముకుంద్ రావు, రాకేశ్​ పాల్గొన్నారు.

సభను సక్సెస్ ​చేసినందుకు థ్యాంక్స్

లోకేశ్వరం,వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ సభ, సంగ్రామ యాత్రను సక్సెస్​ చేసిన కార్యకర్తలు, లీడర్లకు ఆ పార్టీ మండల అధ్యక్షుడు పాల గంగాధర్​ కృతజ్ఞతలు తెలిపారు. మండల కేంద్రంలోని లక్ష్మి ఫంక్షన్ ​హాల్​లో నిర్వహించిన సమావేశం నిర్వహించారు. సమావేశంలో లీడర్లు సుమన్, రమేశ్, దేవేందర్, సాయినాథ్, రాజు, నరేశ్ ఉన్నారు.

‘యాత్ర’ సక్సెస్​తో టీఆర్ఎస్​ లీడర్లలో దడ

బీజేపీ నేత పవార్​ రామారావు పటేల్​

భైంసా,వెలుగు: బీజేపీ చీఫ్​బండి సంజయ్ నిర్వహించిన భైంసా సభ, ప్రజాసంగ్రామ యాత్ర సక్సెస్​ కావడంతో స్థానిక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ లీడర్లు భయపడుతున్నారని ఆ పార్టీ లీడర్ పవార్​ రామారావు పటేల్ పేర్కొన్నారు. శనివారం ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడారు. ముథోల్ నియోజకవర్గంలో బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రను సక్సెస్ చేసిన కార్యకర్తలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు, యువకులు, రైతులు, కార్మికులు పాదయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొన్నారని తెలిపారు. భైంసాలో బండి సంజయ్ బహిరంగ సభ, పాదయాత్రను విఫలం చేసేందుకు మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి, ముథోల్​ఎమ్మెల్యే విఠల్​రెడ్డి కుట్రలు చేశారని ఆరోపించారు. ప్రజల ముందు టీఆర్ఎస్​లీడర్ల కుట్రలు ఫెయిలయ్యాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని తెలిపారు. సమావేశంలో లీడర్లు చక్రధర్​పటేల్, దిగంబర్, అశ్విన్ తదితరులు ఉన్నారు.

వేజ్​బోర్డు ఒప్పందం ఆలస్యానికి కేంద్రమే కారణం

మందమర్రి,వెలుగు: బొగ్గు గని కార్మికుల 11వ వేజ్​ బోర్డ్​ అగ్రిమెంట్ అమలులో జాప్యానికి కేంద్ర ప్రభుత్వం, కోలిండియా యాజమాన్యమే కారణమని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. శనివారం మందమర్రి ఏరియా కేకే5 గనిపై ఏర్పాటు చేసిన గేట్​మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ఒకటి, రెండు వేజ్ బోర్డు మీటింగ్​లలో పది సంవత్సరాల కాలపరిమితి వేజ్​బోర్డు ఉండాలని కోలిండియా యాజమాన్యం చేసిన ప్రతిపాదనను కార్మిక సంఘాలు వ్యతిరేకించాయన్నారు. ఇటీవల జరిగిన ఏడో విడత చర్చల్లో కొత్తగా డీపీఈ గైడ్​లైన్స్​ పేరుతో ఆఫీసర్ల కన్నా కార్మికుల జీతాలు ఎక్కువగా ఉన్నాయని, జూనియర్​ఆఫీసర్​ కంటే తక్కువ ఉండాలంటూ కొత్త నాటకం మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం తీరును వ్యతిరేకిస్తూ ఈనెల 9న బొగ్గుగనులపై నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు. వేజ్​బోర్డుపై అవగాహన లేకుండా జాతీయ సంఘాలను టీబీజీకేఎస్​ విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో బ్రాంచి సెక్రటరీలు సలెంద్ర సత్యనారాయణ, ఎండీ అక్బర్​అలీ, వైస్ ప్రెసిడెంట్లు భీమానాధుని సుదర్శనం, ఇప్పకాయల లింగయ్య, లీడర్లు సోమిశెట్టి రాజేశం,  శ్రీనివాస్, పెద్దపల్లి బాణయ్య, పిట్ కార్యదర్శులు కొత్త తిరుపతి, వెల్ది ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

‘బండి సంజయ్​ తెల్వదనడం దారుణం’

ఆదిలాబాద్,వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ఎవరో అని ఎమ్మెల్యే జోగు రామన్న చెప్పడం దారుణమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఫైర్​అయ్యారు. శనివారం ఆయన స్థానికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఎనిమిదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ట్రైనింగ్​లో ఎమ్మెల్యే మంచి నటన చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. మూడు నెలల క్రితం ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వవాని అప్పగించే విషయమై చర్చలకు కేంద్రం ఆహ్వానించిందని, కానీ.. ఎంవోయూ కొరకు ప్రభుత్వం స్పందించలేదన్నారు. సీసీఐ సాధన కమిటీ పేరుతో జిల్లా ప్రజల ముందు డ్రామాలు ఆడి వారిని తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.