డ్రాతో గట్టెక్కిన మిథాలీ సేన

డ్రాతో గట్టెక్కిన మిథాలీ సేన
  • స్నేహ్, తానియా అద్భుత పోరాటం

బ్రిస్టల్: లోయరార్డర్ బ్యాట్స్‌‌విమెన్‌‌ స్నేహ్ రాణా(80 నాటౌట్), తానియా భాటియా(44 నాటౌట్) అద్భుత పోరాటంతో ఇంగ్లండ్ విమెన్స్‌‌తో జరిగిన ఏకైక టెస్ట్‌‌లో ఇండియా డ్రాతో గట్టెక్కింది. 165 రన్స్ లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ ఫాలోఆన్‌‌ ఆడిన మిథాలీ సేన  చివరి రోజైన, శనివారం చివరకు 344/8పై ఉన్నప్పుడు మ్యాచ్‌‌ను  డ్రా గా ముగించారు. లోయరార్డర్ బ్యాట్స్​విమెన్​ పోరాటంతోపాటు వాతావరణం కూడా ఈ మ్యాచ్‌‌లో ఇండియాకు మేలు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌‌లో స్నేహ్ రాణాతో పాటు షెఫాలీ వర్మ(63), దీప్తి శర్మ(54) హాఫ్ సెంచరీలు చేశారు. ఇంగ్లిష్ బౌలర్లలో ఎకిల్‌‌స్టోన్‌‌(4/118) నాలుగు వికెట్లు తీసింది.  షెఫాలీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అంతకుముందు 83/1తో ఆఖరి రోజు, శనివారం  సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించిన ఇండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓవర్‌‌నైట్‌‌ స్కోరుకు 6 పరుగులే జోడించిన షెఫాలీ త్వరగానే పెవిలియన్ చేరింది. ఆ తర్వాత దీప్తి , పూనమ్ రౌత్(39) మూడో వికెట్​కు 72 రన్స్ పార్టనర్షిప్ చేసి నిలకడ చూపెట్టారు. అయితే, ఓ చెత్త షాట్‌‌తో దీప్తి వికెట్‌‌ ఇవ్వగా.. 171/3తో ఇండియా లంచ్‌‌కు వెళ్లింది. బ్రేక్ అనంతరం ఇండియన్ మిడిలార్డర్ మరోసారి కుప్పకూలింది  మిథాలీ రాజ్(4), పూనమ్ రౌత్, హర్మన్‌‌ ప్రీత్‌‌ శిఖా పాండే(18), పూజా వస్త్రాకర్(12)ను  స్వల్ప తేడాలో ఔట్ చేసిన  ఇంగ్లండ్ మ్యాచ్ గెలిచేలా కనిపించింది. కానీ తొమ్మిదో వికెట్‌‌కు  104 రన్స్ జోడించిన  చేసిన స్నేహ్–తానియా జోడీ ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు కుమ్మరించింది. ఈ క్రమంలో డెబ్యూ ప్లేయర్ స్నేహ్ కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకుంది. ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌‌లో ఇంగ్లండ్ 396 రన్స్ చేయగా ఇండియా 231కి ఆలౌటైంది.