
- మండిపోతున్న ఉత్తరాది జిల్లాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలు ఎండలతో మండిపోతుంటే.. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం రెమాల్ తుఫాన్ ప్రభావంతో వర్షాలు పడ్తున్నాయి. ప్రస్తుతం ఉత్తరాది జిల్లాల్లో టెంపరేచర్లు 47 డిగ్రీలకు చేరువవుతుండగా.. దక్షిణాదిన మాత్రం కంట్రోల్లోనే ఉన్నాయి. జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో టెంపరేచర్లు 45 డిగ్రీలకుపైగా రికార్డవుతున్నాయి. దక్షిణాది జిల్లాల్లో 42 డిగ్రీల లోపలే నమోదవుతున్నాయి.
ఆదివారం జగిత్యాల జిల్లా జైనలో అత్యధికంగా 46.5 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 45.8, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 45.7, ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో 45.2, నిర్మల్ జిల్లా ముజ్గిలో 45, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో 45 డిగ్రీలు నమోదైంది. కామారెడ్డి జిల్లా కొల్లూరులో 44.6, రాజన్న సిరిసిల్ల జిల్లా వట్టెమాలలో 44.4, మెదక్ జిల్లా రేగోడులో 44.4, కరీంనగర్ జిల్లా ఇందుర్తిలో 44.2, నిజామాబాద్ జిల్లా వాయిల్పూర్లో 44.1, ఖమ్మం జిల్లా ముదిగొండలో 44 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 39 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైతే.. మిగతా జిల్లాల్లో మాత్రం 43 డిగ్రీల కన్నా తక్కువే టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి.
దక్షిణాదిపై రెమాల్ తుఫాన్ ప్రభావం
ఉత్తరాది జిల్లాల్లో ఎండలు ముదురుతుంటే.. దక్షిణాదిలోని నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. రెమాల్ తుఫాను కారణంగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు పడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వికారాబాద్ జిల్లాలోని కొన్ని చోట్ల గంటకు 70 కిలో మీటర్లు, సిద్దిపేటలో 54 కిలో మీటర్లు, రంగారెడ్డిలో 42 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నట్టు ఐఎండీ పేర్కొంది.
నాగర్‌కర్నూల్‌లో అత్యధికంగా 3.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లా రేవల్లిలో 3.5 సెంటీ మీటర్లు, మహబూబ్‌నగర్ జిల్లా కొత్తమోల్గారాలో 3.3 సెంటీ మీటర్లు, నల్గొండ జిల్లా ఘన్‌పూర్‌లో 3.2 సెంటీ మీటర్లు, నారాయణపేట జిల్లా నర్వలో 3.2 సెంటీ మీటర్లు, నాగర్‌కర్నూల్ జిల్లా పాలెంలో 3.2 సెంటీ మీటర్లు, మహబూబ్‌నగర్‌లో 2.9 సెంటీ మీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో 2.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.
హైదరాబాద్ సిటీలో ఉన్నట్టుండి మబ్బులు.. గాలులు..
హైదరాబాద్ సిటీలో మధ్యాహ్నం వరకు ఎండ కొట్టినా.. ఉన్నట్టుండి మబ్బులు కమ్మేశాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మబ్బులతో పాటు ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల వర్షం పడింది. హయత్‌నగర్, సరూర్‌నగర్‌లలో ఒక సెంటీ మీటర్ చొప్పున వర్షపాతం నమోదైంది. ఉప్పల్, శేరిలింగంపల్లి, పటాన్చెరు, కూకట్‌పల్లిలోనూ తేలికపాటి జల్లులు కురిశాయి. సిటీ శివారులోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు బీభ్సతం సృష్టించాయి. కొన్ని ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కరెంట్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి.
ఎండలు పెరుగుతయ్..
రాబోయే నాలుగైదు రోజుల పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. టెంపరేచర్లు సగటున 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రత్యేకించి జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో టెంపరేచర్లు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. వాటితో పాటు నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, హనుమకొండ, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో 45 డిగ్రీల వరకు టెంపరేచర్లు రికార్డయ్యే చాన్స్ ఉంది. మిగతా జిల్లాల్లో సాధారణం కంటే కొంచెం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
అయితే.. వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వాతావరణం కొంచెం చల్లగా ఉండే అవకాశం ఉంది. కాగా, నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలోకి విస్తరించినట్టు వెల్లడించింది.