మిజోరంలో 77.04 శాతం పోలింగ్

మిజోరంలో 77.04 శాతం పోలింగ్

  ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 40 స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. సాయంత్రం ఐదు గంటల వరకు 77.04 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు కంప్లీట్ అయింది. మొత్తం 174 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 11 జిల్లాలు ఉండగా.. సార్చిప్​లో రికార్డు స్థాయిలో 83.96 శాతం పోలింగ్ రికార్డయింది. ఖౌజ్​వాల్​లో 79 శాతం, హనాథియాల్​లో 78 శాతం పోలింగ్ నమోదైంది. సయ్యా జిల్లాలో అతి తక్కువగా 53 శాతం, ఐజ్వాల్​లో 66 శాతం పోలింగ్ రికార్డయింది. ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు ముగిశాయని మిజోరం అడిషన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ హెచ్ లియాంజెలా ప్రకటించారు. 2018లో 81 శాతం పోలింగ్ నమోదైంది. 

సీఎం వచ్చినప్పుడే మోరాయించిన ఈవీఎం

ఐజ్వాల్​లోని ఒక పోలింగ్ స్టేషన్​లో మాత్రమే ఈవీఎం మోరాయించిందని ఎన్నికల అధికారి వివరించారు. సీఎం జోరంతంగా ఓటేసేందుకు వెళ్లినప్పుడే ఈవీఎం పని చేయలేదన్నారు. పొద్దున సీఎం జోరంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెంగ్లాయి ప్రైమరీ స్కూల్​లోని పోలింగ్ స్టేషన్​కు వెళ్లారు. అయితే, అక్కడ ఈవీఎం మోరాయించింది. దీంతో ఆయన ఓటు వేయకుండానే ఇంటికెళ్లిపోయారు. ఈవీఎంలో సాంకేతిక సమస్య పరిష్కరించినట్లు అధికారులు చెప్పడంతో 9.40 గంటలకు మళ్లీ పోలింగ్​స్టేషన్​కు వచ్చి ఓటేశారు. స్టేట్ కాంగ్రెస్ చీఫ్ లాల్​సావ్తా తన ఓటు హక్కును ఐజ్వాల్ వెస్ట్ 3 సెగ్మెంట్​లోని పోలింగ్ స్టేషన్​లో వినియోగించుకున్నారు. 

ఎంఎన్ఎఫ్ గెలుపుపై జోరంతంగా ధీమా

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7,200 మంది పోలీసులను మోహరించారు. మిజో నేషనల్ ఫ్రండ్(ఎంఎన్ఎఫ్) అధికారంలోకి వస్తుందని సీఎం జోరంతంగా ధీమా వ్యక్తం చేశారు. పొత్తులతో పనిలేకుండానే ఎంఎన్ఎఫ్ అధికారంలోకి వస్తుందని వివరించారు.