
కోరుట్ల, వెలుగు: రైతులకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, చాలా ఏళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న రాళ్లవాగు ప్రాజెక్టు పనులు చేపట్టినట్లు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం కథలాపూర్, కోనాపూర్మండలాల పరిధిలోని రాళ్లవాగు ప్రాజెక్టును ఇరిగేషన్ అధికారులతో కలిసి విప్ పరిశీలించారు. పాడైన హెడ్ రెగ్యులేటరీ, మత్తడి, కాల్వలను వెంటనే శుభ్రం చేయాలని ఆదేశించారు. కాల్వల రిపేర్లకు గతంలో రూ.21 లక్షలు మంజూరు చేశామన్నారు.
శ్రీమడేలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన
వేములవాడరూరల్, వెలుగు: వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మడేలేశ్వర్ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయనను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, మల్లేశం, వెంకటేశ్, ఎల్లగౌడ్, శేఖర్ పాల్గొన్నారు.