
గంగాధర, వెలుగు: ధరణి వల్ల ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు భూభారతి ద్వారా మోక్షం లభిస్తుందని, కొత్త చట్టంలో సమస్యలపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం మధురానగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మేధావులు, రాజకీయ నాయకులు, రైతు సంఘాల నాయకులు, అధికారులతో చర్చించి భూభారతిని తీసుకొచ్చారన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ ధరణిలోని పొరపాట్లను సవరించేందుకు కలెక్టర్‌కు మినహా ఎవరికీ అవకాశం లేదని, కానీ భూభారతితో ఆ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. అనంతరం గంగాధర మండలం కురిక్యాలలో నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం గర్శకుర్తిలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు సెంటర్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను కలెక్టర్ సందర్శించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్వర్, తహసీల్దార్ అనుపమరావు, ఎంపీడీవో రాము పాల్గొన్నారు.ఏఎంసీ చైర్‌పర్సన్ రజిత, కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ తిర్మల్‌రావు, డీఎంహెచ్‌వో వెంకటరమణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మనోహర్ పాల్గొన్నారు.
చొప్పదండి, వెలుగు: ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. చొప్పదండి మండలం రుక్మాపూర్ కేజీబీవీలో రూ.3.25 కోట్లతో చేపడుతున్న అదనపు తరగతి గదులు, ల్యాబ్‌ల నిర్మాణానికి ఎమ్మెల్యే సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయంగా ముఖ్యమంత్రే విద్యాశాఖను పర్యవేక్షిస్తుండటంతో ప్రతీ పాఠశాలలో కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కొండగట్టు దేవస్థానం ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఏఎంసీ చైర్మన్ కొత్తూరు మహేశ్ పాల్గొన్నారు.