
దేవరకొండ, వెలుగు : దేవరకొండ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామాల్లో మార్నింగ్ వాక్ విత్ పీపుల్స్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ తెలిపారు. శుక్రవారం దేవరకొండ మండలం జటావత్ తండా, కొర్ర తండాలలో ఆయన మార్నింగ్ వాక్ నిర్వహించారు. స్థానిక లీడర్లతో కలిసి వివిధ కాలనీల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్నింగ్ వాక్ ద్వారా ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు చేరేలా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. అనంతరం చందంపేట మండలం ధర్మతండాలో ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు దేవరకొండ మార్కెట్ యార్డ్లో ఇదంపల్లి గ్రామానికి చెందిన 40 కుటుంబాలు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరగా వారికి కండువాలు కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాల్లో దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, ప్యాక్స్ చైర్మన్ నరసింహారెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, బద్యా నాయక్, లీడర్లు వెంకటేశ్వరరావు, భిక్కునాయక్, తదితరులు పాల్గొన్నారు.