
- ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, వెలుగు : దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి విద్యుత్ థర్మల్ పవర్ ప్లాంట్ లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజల పక్షాన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో 335 మంది భూనిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యాదాద్రి విద్యుత్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులు పలుమార్లు వైటీపీఎస్ పర్యటనల్లో తనను కలిసి సమస్యలు వివరించారని తెలిపారు. వారి సమస్యలు, డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. దీంతో ప్రభుత్వం వారికి కానుకగా ఉద్యోగాలు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటికే 112 మంది భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. నియోజకవర్గంలోని పరిశ్రమల నుంచి సీఎస్ఆర్ ఫండ్ అందిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉందని, ఇందుకు ప్రభుత్వ పెద్దలందరూ సహకరించాలని కోరారు.
మీడియేటర్ల అసోసియేషన్ కు సహకరిస్తాం
ఇటీవల ఎన్నికైన ది రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ మిర్యాలగూడ అసోసియేషన్ కు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆకుమర్తి వెంకన్నతోపాటు కార్యవర్గ సభ్యులు శుక్రవారం స్థానిక క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్వెస్టర్లతోపాటు మీడియేటర్ల ద్వారా రియల్ ఎస్టేట్ రంగం మరింత అభివృద్ధి సాధించి రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దిక్సూచిగా మారాలని సూచించారు.