యాదాద్రి అవినీతిలో కవితకు 50% వాటా : ​బీర్ల అయిలయ్య

యాదాద్రి అవినీతిలో కవితకు 50% వాటా : ​బీర్ల అయిలయ్య

యాదాద్రి, వెలుగు: యాదాద్రి అభివృద్ధి పేరుతో జరిగిన అవినీతిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 50 శాతం వాటా దక్కిందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆరోపించారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్​రెడ్డికి షేర్ ముట్టిందన్నారు. అయిలయ్య ఆదివారం యాదగిరిగుట్టలో మీడియాతో మాట్లాడారు. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్​లీడర్లు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు.

గుడి నిర్మాణ పనులను ఈఎన్ సీ గణపతిరెడ్డి తన బంధువులకు అప్పగించి, వాటాలు దండుకున్నారని.. ఆయన తిన్న మొత్తాన్ని కక్కిస్తామని చెప్పారు. గణపతిరెడ్డిని తొలగించి, ఆలయ నిర్మాణంలో జరిగిన అవినీతిపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతామని తెలిపారు. అభివృద్ధి పేరుతో గత ప్రభుత్వం యాదాద్రిలో ఎన్నో కుటుంబాలను చిందరవందర చేసిందన్నారు.

బీఆర్ఎస్​సర్కార్​అనాలోచిత నిర్ణయాలతో అనేక మంది ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కొండమీద భక్తులపై విధించిన ఆంక్షలను తొలగిస్తామని చెప్పారు. కొండపై స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. డార్మెటరీ హాలు నిర్మించి, 500 మంది నిద్రించే వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు. కల్యాణకట్ట, గుండం కూడా పైనే ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. యాదాద్రి మెడికల్ కాలేజీని తరలించబోతున్నారంటూ బీఆర్ఎస్​చేస్తున్న అసత్య ప్రచారం చేస్తోందని, మెడికల్ కాలేజీ ఎక్కడికీ పోదని స్పష్టం చేశారు.