అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు :ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు :ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
  •     ప్రభుత్వ విప్, ఆలేరు  ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు       ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. గురువారం యాదగిరిగుట్టలోని బీర్ల నిలయంలో బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాలు, ఆలేరు పట్టణానికి సంబంధించిన 94 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే సీఎం రేవంత్ రెడ్డితో కొడ్లాడి అదనంగా మరో 200 ఇండ్లు కలిపి మొత్తం 3,700 ఇండ్లను మంజూరు చేపించానని తెలిపారు. 

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని, నియోజకవర్గంలో ప్రతి ఏడాది 3,500 ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని, ప్రతి పేదోడి సొంతింటి కలను సాకారం చేసి ఇందిరమ్మ ఆశయాలను నెరవేర్చుతామని పేర్కొన్నారు. లబ్ధిదారులు త్వరగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చైతన్యామహేందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్, తుర్కపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మోహన్ బాబునాయక్ తదితరులు పాల్గొన్నారు.