ఖేడ్​లో నయా పాలిట్రిక్స్ .. ఒక్కటైన కాంగ్రెస్ దాయాదులు

ఖేడ్​లో నయా పాలిట్రిక్స్  .. ఒక్కటైన కాంగ్రెస్ దాయాదులు

సంగారెడ్డి/నారాయణఖేడ్, వెలుగు:  సంగారెడ్డి జిల్లాలో విలక్షణ రాజకీయాలకు నారాయణఖేడ్ నియోజకవర్గం పేరుగాంచింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులు ఉండరన్న నిజాన్ని ఖేడ్ పొలిటికల్ స్ట్రాటజీ మరోసారి రుజువు చేసింది. మొన్నటి వరకు రాజకీయంగా ఒకరినొకరు దూషించుకున్న అన్నదమ్ముళ్లు నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మారెడ్డి విజయపాల్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే మారెడ్డి భూపాల్ రెడ్డి కలిసిపోయారు. అలాగే ఇంతకాలం కాంగ్రెస్ దాయాదులుగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి, మాజీ ఎంపీ సురేశ్​షెట్కర్ మధ్య సయోధ్య కుదిరింది.

ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ పొలిటికల్ గేమ్ కారణంగా ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో రాజకీయాలు వేడెక్కాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉండి ఒకరినొకరు విమర్శించుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు షెట్కర్, సంజీవరెడ్డి ఇప్పుడు ఓకే వేదికను పంచుకొని బలమైన ప్రత్యర్థిని ఢీ కొట్టబోతున్నారు. అలాగే రోజురోజుకు బలపడుతున్న కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి తన సోదరుడు విజయపాల్ రెడ్డిని కారెక్కించుకొని పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారు. ఈ రెండు పార్టీలు ప్రజలని తమ వైపు తిప్పుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 

ALSO READ : పాలమూరు జిల్లాలో పూర్తయిన నామినేషన్ల స్క్రూటినీ

కాంగ్రెస్ ఎఫెక్ట్ తోనే

కాంగ్రెస్ దాయాదులు మాజీ ఎంపీ సురేశ్ షెట్కర్, కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి ఒకటవ్వడంతో బీఆర్ఎస్ వర్గాలలో టెన్షన్ షురూ అయ్యింది. ఈ ఇద్దరి మధ్య కొంతకాలంగా నెలకొన్న వర్గపోరును తొలగించి వారి మధ్య సయోధ్య కుదూర్చడంలో కాంగ్రెస్ హై కమాండ్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ పై ఆ ప్రభావం పడింది.  దీంతో బీజేపీ టికెట్​ఆశించి భంగపడ్డ మాజీ ఖేడ్​ ఎమ్మెల్యే విజయ్​పాల్​ రెడ్డిపై బీఆర్ఎస్ చూపు పడింది.  అసంతృప్తితో ఉన్న విజయపాల్ రెడ్డికి నచ్చజెప్పి శనివారం మంత్రి హరీశ్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన తమ్ముడు సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి అయిన భూపాల్ రెడ్డి గెలుపు కోసం పనిచేస్తానని విజయపాల్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించి పరువు కాపాడుకునే పనిలో ఉండగా, పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ శ్రేణులు పోరాడుతున్నారు.