
ఖానాపూర్, వెలుగు: మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలు, రైతులకు మేలు జరిగేలా చూడాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సూచించారు. నియోజకవర్గంలో వర్షాల వల్ల కలిగిన నష్టం, అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో శుక్రవారం ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రివ్యూ నిర్వహించారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడించారు. పంట నష్టంపై అంచనాలు వేయాలని వ్యవ సాయ శాఖ అధికారులకు సూచించారు. పాడైపోయిన రహదారులకు వెంటనే రిపేర్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. గ్రామాల్లో కరెంట్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు.
కడెం ప్రాజెక్టు, సదర్ మాట్ ఆనకట్టలకు వస్తున్న వరదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి స్థానికులను అప్రమత్తం చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, తహసీల్దార్ సుజాతారెడ్డి, ఎంపీడీవోలు సునీత, రత్నాకర్ రావు, సీఐ అజయ్ కుమార్, పీఏసీఎఎస్ చైర్మన్లు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, మున్సిపల్ మాజీ చైర్మన్ చిన్నం సత్యం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దయానంద్, నాయకులు పాల్గొన్నారు.