
లింగాల, వెలుగు: పేదలకు సొంతింటి కల సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. లింగాలలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సోమవారం ప్రొసీడింగ్స్‌ను కాంగ్రెస్ రాష్ట్ర నేత రంగినేని శ్రీనివాసరావుతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సొంత ఇంటిలోనే జీవించాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అందుకే ప్రతి పేదకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు నిర్ణయించిందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ దశాల వారీగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని సూచించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. లింగాల మండలంలోని రాయవరం రెవెన్యూ శివారులో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సర్వేనెంబర్ 83 కు చెందిన భూమి సరిహద్దు సర్వే నిర్వహించి సమస్యను పరిష్కరించి రైతులకు మేలు చేస్తామని హామీ ఇచ్చారు.
లింగాల మండలంలో 425 ఇండ్లు మంజూరైనట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు రంగినేని శ్రీనివాసరావు, కొండల్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, రాయవరం మాజీ సర్పంచ్ మల్లయ్య, ముక్తార్, లక్ష్మణ్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివ, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఇందిరమ్మ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.