ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలి ఆత్మహత్యాయత్నం

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలి ఆత్మహత్యాయత్నం

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధిస్తున్నారంటూ గత కొంతకాలంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న శేజల్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో విషం తాగి సూసైడ్ కు యత్నించారు. దీంతో వెంటనే ఆమెను ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తన ఆత్మహత్యపై శేజల్ లేఖ రాసింది. 


లేఖలో ఏముంది..

గౌరవనీయులైన న్యాయమూర్తులకు, తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు, మీడియా మిత్రులకు నా విన్నపం..

నన్ను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరియు వారి అనుచరులైన భీమాగౌడ్, చిల్లరపు సతీష్, కుమ్మరి పోచన్న, కొనంకి కార్తీక్ లు కొంత కాలంగా మానసికంగా రకరకాలుగా హింసిస్తున్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నన్ను వేధిస్తూ వాళ్ల అనుచరులతో చంపుతానని బెదిరిస్తుండటంతో నేను ఢిల్లీకి వచ్చి నిరసన తెలియజేస్తుండగా..గత రెండు రోజుల నుంచి ఎమ్మెల్యే అనుచరులు సోషల్ మీడియాలో నా ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ నా గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ నన్ను తీవ్ర మనస్థాపానికి గురి చేస్తుండటంతో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. గోలి శివ మరియు ఇంకో వ్యక్తి నా గురించి తప్పుడు ప్రచారం చేస్తూ చంపుతామని బెదిరిస్తున్నారు. 

నేను పలుమార్లు తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు కేసులను నమోదు చేయకపోగా తప్పుడు కేసులు నా మీద పెడుతూ నన్ను చిత్ర హింసకు గురిచేస్తున్నారు. 

విజ్ఞప్తి : నేను చనిపోయిన తర్వాత అయినా నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ..నేను ఈ సూసైడ్ లెటర్ రాస్తున్నాను... అంటూ శేజల్ లేఖ రాసింది.  

 

మాపై తప్పుడు కేసులు పెట్టారు..

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ..ఆయనపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ అరిజిన్ డెయిరీ సీఈవో ఆదినారాయణ, సీఏవో శేజల్​ఢిల్లీలోని ఆందోళనకు దిగారు. తనపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య  లైంగిక వేధింపులకు పాల్పడ్డారని జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేసినట్లు శేజల్‌ చెప్పారు.  ఎమ్మెల్యే తమను లైంగికంగా వేధిస్తున్నారని... తనకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని తెలిపారు. ఇప్పటికే మాపై తప్పుడు కేసులు పెట్టారని.. బెయిల్‌పై బయటకు వచ్చినా.. బెదిరిస్తున్నారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ అడిగానని..కానీ  ఇవ్వడం లేదంటూ శేజల్‌ తెలిపారు.  తనలాగే ఎంతోమంది బాధితులున్నారని శేజల్‌ పేర్కొన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే పెద్ద ఉమనైజర్ అని....తన దగ్గర అన్ని  ఆధారాలన్నాయని..వాటిని భద్రంగా ఉంచామని తెలిపారు. తెలంగాణ పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం లేదని.. తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని బాధితురాలు శేజల్ తెలిపారు.