కేసీఆర్​ను మించిన పెద్ద దళితుడు లేడు

కేసీఆర్​ను మించిన పెద్ద దళితుడు లేడు

ఎవరైతే అణచివేతకు గురైతరో వాళ్లే దళితులు.. 
కేసీఆర్​ను మించిన పెద్ద దళితుడు లేడు
సెప్టెంబర్​ 17న జెండా ఎగిరేస్తే వచ్చేదేముంది?: ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్​

హైదరాబాద్‌‌, వెలుగు: దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తామని కేసీఆర్‌‌ హామీ ఇయ్యలేదని, ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెట్టలేదని టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌‌ అన్నారు. కేసీఆర్‌‌ను మించిన దళితుడెవ్వరూ లేరని చెప్పారు. కేసీఆర్‌‌ సీఎం అయితేనే తెచ్చుకున్న తెలంగాణ బాగు పడుతుందని ఆయనను ముఖ్యమంత్రిని చేసుకున్నామని అన్నారు. 

‘‘ఎవరైతే అణచివేతకు గురైతరో వారే పెద్ద దళితులు. కేసీఆర్​ను మించిన పెద్ద దళితుడు లేడు. వందేండ్లు ఆలోచించినా బీజేపీకి దళిత బంధు స్కీం ఇయ్యాలని ఐడియా వస్తదా? ఏ దళితుడ్ని సీఎం చేస్తే ఏం మారిందో చెప్పాలె?  నువ్వు రాష్ట్రపతిని చేసినవ్​ కదా.. ఏం మార్చినవ్​ చెప్పు? కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం పథకం పెట్టినవ్​? ట్రైబల్​ మహిళను రాష్ట్రపతిని చెయ్యంగనే ట్రైబల్స్​ బతుకులు మారినయా?” అని బీజేపీని ప్రశ్నించారు. ఎంపీ బడుగుల  లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, భగత్‌తో కలిసి టీఆర్‌ఎస్‌ ఎల్పీలో  కిశోర్​ మీడియాతో మాట్లాడారు. 

బీజేపీది మతోన్మాద ఎజెండా
మతోన్మాదం తప్ప బీజేపీకి ఇంకో ఎజెండా లేదని కిశోర్​ఆరోపించారు. జూన్‌ 2న తెలం గాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామని, అలాంటప్పుడు సెప్టెంబర్‌ 17న జెండా ఎగరేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ‘‘సెప్టెంబర్​ 17ను నిన్ను ఎవడడిగిండు..? జెండా ఎగిరేస్తే వచ్చేదేముంది? ఎగిరేయకపోతే వచ్చేదేముంది?” అని అన్నారు. చరిత్రను అమిత్‌ షా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘‘కేసీఆర్‌ జాతీయ రాజకీయాలకు వెళ్లకుండా అడ్డుకునేందుకే బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక తెచ్చింది.  అవసరం లేకున్నా జరుగుతున్న ఈ ఉప ఎన్నిక వైపు దేశం మొత్తం చూస్తున్నది. 

మునుగోడు మీటింగ్‌లో అమిత్‌ షా అన్నీ అబద్ధాలే చెప్పారు. ఉప ఎన్నికలో ఎగరేది గులాబీ జెండానే” అని అన్నారు. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ శిఖండి రాజకీయాలు చేస్తున్నదని, వాటిని ఎదుర్కొని తీరుతామన్నారు. రాజగోపాల్‌ రెడ్డిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అమిత్​ షా పారిపోయారని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌  విమర్శించారు.