రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే గండ్ర హెచ్చరిక

రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే గండ్ర హెచ్చరిక

భూపాలపల్లిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్వహించిన ‘హాత్ సే హాత్ జోడో’ యాత్రలో జరిగిన సంఘటనలపై స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి తమపై చౌకబారు ఆరోపణలు చేసినా చాలా ఓపికతో ఉన్నామని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు నిరాశలో ఉన్నారని చెప్పారు. మాట్లాడే తీరును రేవంత్ రెడ్డి మార్చుకోవాలని హెచ్చరించారు. నిన్నటి ఘటనలో కాంగ్రెస్ కార్యకర్తలే బీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టారని చెప్పారు. రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే దొంగే దొంగ అని అరిచినట్లు ఉందన్నారు. రేవంత్ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైందో..  ఎక్కడి నుండి ఎక్కడకు వచ్చాడో ప్రజలందరికీ తెలుసన్నారు. 

కాంగ్రెస్ పార్టీ అంటేనే పెద్ద నాయకుల కుట్రలు ఉంటాయని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. 2009 లో తాను గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా  తన ఎదుగుదలను తొక్కేసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో తాను ఆస్తులు సంపాదించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేస్తే.. ప్రతి విషయంలోనూ తనను అణగదొక్కాలని చూశారని చెప్పారు. 2018లో మరోసారి కాంగ్రెస్ నుంచి గెలిచిన తర్వాత నియోజకవర్గం ప్రజల అభిప్రాయం మేరకు తాను బీఆర్ఎస్ లో చేరానని వివరించారు. తన భార్య గండ్ర జ్యోతి పదవికి కోసమే అధికార పార్టీలోకి వెళ్లాడని ఆరోపణలు చేస్తున్నారని తప్పుపట్టారు. తానోక్కడినే పార్టీ మారలేదన్నారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అసెంబ్లీలోనే కేసీఆర్ చెప్పేవారని తెలిపారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని, సోనియాగాంధీని విమర్శించిన రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చాడని విమర్శించారు. ‘నీ రాజకీయ ప్రయోజనాల కోసం నువ్వు పార్టీ మారవచ్చు.. కానీ, ప్రజా అవసరాల కోరకు నేను పార్టీ మారకూడదా...?’ అని రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే గండ్ర ప్రశ్నించారు. 

ముస్లింలకు చెందిన గుట్టలు ఉన్న స్థలాన్ని ఇండస్ట్రీ పెట్టడం కోసం న్యాయబద్దంగా కొంటే కబ్జా చేశారని రేవంత్ రెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నాడని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. ఆ స్థలం కబ్జా చేసినట్లయితే.. జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయాలి గానీ, ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. ‘నా ప్రాంతం మీద అభిమానంతో ఫామాయిల్ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే భూమి కబ్జా చేశాడని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. రేపు ఉదయం11 గంటలకు అంబేడ్కర్ చౌరస్తాలో చర్చకు సిద్ధం. గండ్ర సత్యనారాయణ దమ్ముంటే రావాలి. నేను డీజీపీ ఆఫీసుకు వెళ్లి రేవంత్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వవద్దని ఫిర్యాదు చేస్తాను’ అని వ్యాఖ్యానించారు. 2023లోనూ భూపాలపల్లి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.