బండి సంజయ్ పచ్చి అబద్దాలు మాట్లాడిండు : ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి

బండి సంజయ్ పచ్చి అబద్దాలు మాట్లాడిండు : ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కొల్లాపూర్లో పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. అధికారం కోసం బీజేపీ నాయకులు నోటికొచ్చిన అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. బీజేపీ పంజరంలో చిలకలుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు మారాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు చేస్తే బండి సంజయ్ గొప్పవాడు కాలేడన్నారు. కేసీఆర్ను తిట్టకపోతే బండి సంజయ్కు మనుగడ లేదని చెప్పారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్.. తెలంగాణ అప్పుల గురించి పార్లమెంట్లో ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. 

దేశానికి పట్టిన చీడ బీజేపీ అని ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధిలో బీజేపీ పాత్ర ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని బీజేపీ చూస్తోందన్నారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే గ్రామాల్లోకి రావాలని సవాల్ విసిరారు. గ్రామాల్లోకి వస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తామన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే కొల్హాపూర్ అభివృద్ధి జరిగిందన్నారు. విద్యార్థులు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతుంటే బీజేపీ నాయకులకు కడుపు మండుతోందన్నారు. బండి సంజయ్ అసెంబ్లీ గేటు కూడా తాకలేడన్నారు. 

తెలంగాణ రూపురేఖలు మార్చిన నాయకుడు కేసీఆర్ అని ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. తెలంగాణ అభివృద్ధిని బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. తెలంగాణ గ్రామాలకు కేంద్రం నిధులు ఇస్తోందంటూ బీజేపీ నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ ప్రభుత్వమే నిధులు మంజూరు చేస్తోందన్నారు. కేంద్రం నిధులు మంజూరు చేస్తే..బీ జేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అభివృద్ధి జరగడం లేదని ప్రశ్నించారు.