తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోను.. జగ్గారెడ్డి వార్నింగ్

తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోను..  జగ్గారెడ్డి వార్నింగ్

హైదరాబాద్, వెలుగు: తనపై తప్పుడు ప్రచారం చేసేవారిపై లీగల్‌‌గా చర్యలు తీసుకుంటానని కాంగ్రెస్  ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. పార్టీలోనే ఉంటూ తనను బదనాం చేస్తున్నవారిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన సీఎల్పీలో మీడియాతో చిట్‌‌చాట్ చేశారు. ఎన్నో కష్టాలు పడి, తన తల్లి జీతం డబ్బులతోనే రాజకీయం చేస్తూ ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు. 

ఏడాది నుంచి తాను సైలెంట్‌‌గా ఉంటున్నప్పటికీ ఏదో ఒకరకంగా తనపై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని జగ్గారెడ్డి వాపోయారు. కొంత మంది ఎదుటోళ్లను అవమానించడమే పనిగా పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు 4 ఏండ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రి చనిపోయారని, తన తల్లి జీతంతోనే పెరిగామని, ఆ జీతంతోనే రాజకీయాలు చేశానని చెప్పారు.  

సీతారాములు పడ్డన్ని కష్టాలు తాను పడ్డానన్నారు. రాజకీయాలు, పార్టీ సభల కోసం  ఎన్నో అప్పులు చేసి ఖర్చు చేశానన్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక కూడా ఏమీ సంపాదించలేదని, తనకు ఆస్తులు ఉన్నట్టు నిరూపిస్తే బహుమతులు ఇస్తానని ఆయన ప్రకటించారు. తన కేరక్టర్ దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఎంతటివారైనా వదిలి పెట్టబోనని, లీగల్‌‌గా ఎదుర్కోవడంతో పాటు వాళ్ల పని తన కార్యకర్తలకు అప్పగిస్తానని జగ్గారెడ్డి హెచ్చరించారు.