చెంచుల సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి

చెంచుల సమస్యల పరిష్కారానికి కృషి :  ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి
  •      ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి
  •     నెల్లికల్ చెంచువాని తండాకు వెళ్లి పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్ 

హాలియా, వెలుగు:  నెల్లికల్ చెంచువాని తండా ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు అధికారులు తండాకే రావడం సంతోషకరమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు.  ప్రజావాణి కార్యక్రమంలో చెంచు మహిళ ఆదెమ్మ తమ తండాలో ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఇతర ధ్రువపత్రాలు లేక ప్రభుత్వ పథకాల లబ్ధి పొందలేకపోతున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠికి వివరించారు. దీన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న కలెక్టర్, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి తో కలిసి  శుక్రవారం ఉదయం తండాకు వెళ్లారు.  

ఎమ్మెల్యే, కలెక్టర్ వెళ్లడంతో  చెంచు ప్రజలు వారి సమస్యలను వివరించారు.  ఆధార్ కార్డులు లేకపోవడం, రేషన్ కార్డుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.  కలెక్టర్ మాట్లాడుతూ..  ప్రతి కుటుంబం అవసరమైన సర్టిఫికెట్లు ఉంచుకోవాలన్నారు.  ముఖ్యంగా ఆధార్ కార్డు అన్ని పథకాలకు అనుసంధానం కావాలన్నారు.  పెన్షన్లు మూడు నెలలకు మించి తీసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 

సాగులో ఉన్న భూములను వదిలేయకుండా కొనసాగించాలని,  కొత్తగా అటవీ భూములను సాగు చేయరాదని చెప్పారు.  కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, గృహనిర్మాణ పీడీ రాజ్‌కుమార్, ఆరోగ్యాధికారి డాక్టర్ శ్రీనివాస్, పశుసంవర్ధక అధికారి డాక్టర్ రమేశ్, మార్కెట్ చైర్మన్  తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.