చివరి ఆయకట్టు వరకూ సాగు నీళ్లిస్తాం

చివరి ఆయకట్టు వరకూ సాగు నీళ్లిస్తాం
  • అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
  • సీతారామ ప్రాజెక్ట్‌‌‌‌ పూసుగూడెం పంప్ హౌస్ వద్ద నీటి విడుదల

ములకలపల్లి, వెలుగు : అశ్వరావుపేట నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకు గోదావరి నీళ్లు అందిస్తామని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చెప్పారు. పూసుగూడెంలోని సీతారామ ప్రాజెక్ట్‌‌‌‌ లిఫ్ట్ ఇరిగేషన్‌‌‌‌ పంప్‌‌‌‌ హౌస్‌‌‌‌ 2 వద్ద ఆదివారం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో ఉన్న 1.39 లక్షల ఎకరాలకు 2026 జూన్‌‌‌‌ నాటికి సీతారామ ప్రాజెక్ట్‌‌‌‌ ద్వారా గోదావరి నీళ్లు ఇస్తామని చెప్పారు.

ప్రాజెక్ట్‌‌‌‌ లింకు కెనాల్స్ ద్వారా ములకలపల్లి మండలంలోని ఎదుళ్లవాగు, పెద్దయ్య చెరువు, తిరుమల చెరువు, మామిళ్లగూడెం, తుమ్మలకుంట, ఊర చెరువు, ఎదుళ్ల చెరువు, మూక మామిడి ప్రాజెక్ట్ నింపి 15,200 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో 12,500 ఎకరాలకు, చండ్రుగొండ మండలం 16,750 ఎకరాలకు, దమ్మపేట మండలంలో 46 వేల ఎకరాలకు, అశ్వరావుపేట మండలంలో 39 వేల ఎకరాలకు నీటిని ఇస్తామని స్పష్టం చేశారు. రైతుల అభివృద్ధి కోసం పనిచేస్తున్న సీఎం రేవంత్‌‌‌‌రెడ్డికి ప్రజలంతా రుణపడి ఉంటారన్నారు.

 కార్యక్రమంలో కాంగ్రెస్‌‌‌‌ మండల అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్‌‌‌‌రావు, ఐబీ ఈఈ సురేశ్‌‌‌‌కుమార్‌‌‌‌, డీఈ మోతీలాల్‌‌‌‌, ఏఈ గఫూర్, మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, నాయకులు పువ్వాల మంగపతి, గాడి తిరుపతిరెడ్డి, కారం సుధీర్, శనగపాటి రవి, సురభి రాజేశ్‌‌‌‌, భూక్యా పత్తిలాల్‌‌‌‌ పాల్గొన్నారు.