చేవేళ్ల ఎమ్మెల్యే అవినీతిపరుడు.. నవాబుపేట మండల బీఆర్ఎస్ నేతల ఆరోపణ

చేవేళ్ల ఎమ్మెల్యే అవినీతిపరుడు.. నవాబుపేట మండల బీఆర్ఎస్ నేతల ఆరోపణ
  •  చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు టికెట్​పై సీఎం మరోసారి ఆలోచించాలి
  • ప్రజల మద్దతు కలిగిన పార్టీ నేతకు ఇవ్వాలి  
  • నవాబుపేట మండల బీఆర్ఎస్ నేతల ఆరోపణలు

చేవెళ్ల, వెలుగు : ఎమ్మెల్యే కాలె యాదయ్యపై సొంత పార్టీ నేతలే తీవ్ర ఆరోపణలు చేశారు. మండల, గ్రామస్థాయి లీడర్లు బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రెస్ మీట్ లో నిర్వహించి తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. కో– ఆప్షన్ మెంబర్ సయ్యద్ గౌస్ మాట్లాడుతూ..‘ఎమ్మెల్యే కాలె యాదయ్య కాళ్లు మొక్కినట్టు నట్టించి.. కాళ్ల మెట్టెలు గుంజేరకం” అని మండిపడ్డారు. 2001 నుంచి 2016 వరకు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గా ఉండి 30 ఎకరాల్లో వెంచర్ చేసి ఓపెనింగ్ కు ఎమ్మెల్యే యాదయ్యను పిలిస్తే, అందులో ఒక ఎకరం రాసిస్తేనే వస్తానని చెప్పారని ఆరోపించాడు. ఎమ్మెల్యే అల్లుడు సాయికుమార్ మాట్లాడుతూ.. నవాబుపేట్ మండలంలో  ఏండ్లులో పార్టీని నమ్ముకుని పని చేస్తుండగా.. అన్ని పదవులను తన ఇంట్లోవారికి ఇచ్చుకున్నారని విమర్శించారు.

ఆయనకు నచ్చనట్టు ఎవరైనా చేస్తే వెంటనే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్లు వస్తాయని, ఏదైనా ఎమ్మెల్యేతో మాట్లాడుకోండి.. లేదంటే కేసు బుక్ చేస్తామని పోలీసులతో హెచ్చరిస్తూ ఒత్తిడి చేయిస్తారని ఆరోపించారు. నవాబుపేట్ వైస్ ఎంపీపీ బందయ్య గౌడ్ మాట్లాడుతూ.. మొయినాబాద్ మండలంలో ఎస్సీలే లేనట్టుగా.. ఎమ్మెల్యే తన కొడుకును జెడ్పీటీసీ చేసి కుటుంబపాలన కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. 

వచ్చే ఎన్నికల్లో చేవెళ్లలో బీఆర్ఎస్ గెలవాలంటే సీఎం కేసీఆర్ మరోసారి ఆలోచించి, ఎమ్మెల్యే టికెట్ మార్పు చేయాలని, ప్రజల మద్దతు ఉన్న పార్టీ నాయకుడు కేఎస్ రత్నంకు ఇవ్వాలని  కోరారు. తామంతా కష్టపడి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని, యాదయ్యనే పోటీలో ఉంటే బీఆర్ఎస్ ఓటమి తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వికారాబాద్ జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు ముక్కు రాములు, మాజీ సర్పంచులు శేఖర్ రెడ్డి, గోపాల్ గౌడ్, నేతలు పాల్గొన్నారు.