
రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ఆదివారం విస్తృతంగా పర్యటించారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన మంద మహేశ్ ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. డ్యూటీకి వెళ్తుండగా ఇటీవల రోడ్డుప్రమాదంలో గాయపడ్డాడు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్.. మహేశ్‌తో వీడియోకాల్ మాట్లాడి అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, అతనికి వైద్య సదుపాయంతో పాటు స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకుంటానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
అనంతరం పలు శుభాకార్యాల్లో పాల్గొన్నారు. తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట మాజీ సర్పంచ్ దుర్గయ్య కొడుకు పెండ్లికి, సిరిసిల్ల మాజీ కౌన్సిలర్ అడ్డగట్ల మురళి కొడుకు వివాహానికి, పట్టణంలోని రాజీవ్ నగర్ లో అలువాల ఈశ్వర్ కూతురు, వీర్నపల్లి మండలం శాంతినగర్ తండా బీఆర్ఎస్ లీడర్ జుంకిలాల్ కొడుకు పెండ్లిళ్లకు హాజరయ్యారు. సాయంత్రం ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.