
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే కేటీఆర్ లేఖ
రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సిరిసిల్లలోని పవర్ లూమ్ కార్మికుల ఆర్థిక సమస్యలను పరిష్కరించి, ఆదుకోవాలని ఎమ్మెల్యే కేటీఆర్ కోరారు. పవర్ లూమ్ కార్మికుల రూ. 35.48 కోట్ల బ్యాక్ బిల్లింగ్ బకాయిలను మాఫీ చేసి, వారికి రావాల్సిన రూ. 101.77 కోట్ల విద్యుత్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు శనివారం కేటీఆర్ లేఖ రాశారు.
సిరిసిల్ల నేత పరిశ్రమ ప్రసిద్ధి చెందిందని, సుమారు 25 వేల పవర్ లూమ్‌లు నడుస్తున్నాయని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు 127 ఎస్ఎస్ఐ యూనిట్లకు, 191 ఇతర యూనిట్లకు బ్యాక్ బిల్లింగ్ బకాయిలు పడ్డాయని, భారీ మొత్తాన్ని చెల్లించే స్థితిలో కార్మికులు లేరని, ఫలితంగా పవర్ లూమ్స్ నడపడం కష్టంగా మారిందని పేర్కొన్నారు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ విడుదల కాకపోవడంతో సిరిసిల్ల కో – -ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ(సెస్) తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి, బకాయిలను మాఫీ చేసి, సబ్సిడీలను విడుదల చేసి నేతన్నలను ఆర్థికంగా ఆదుకోవాలని కేటీఆర్ ఆ లేఖలో వివరించారు.