మాకు ఓటెయ్యకుంటే పేదలని కూడా చూడం.. డబుల్​ ఇండ్లియ్యం

V6 Velugu Posted on Apr 25, 2021

జడ్చర్ల, వెలుగు:  మున్సిపల్​ఎన్నికల్లో టీఆర్​ఎస్​ పార్టీకి ఓటెయ్యకుంటే పేదలని కూడా చూడబోమని, ఎవరికీ ఇండ్లివ్వబోమని బేడ బుడగజంగాలను అధికార పార్టీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బెదిరించారు. శనివారం ఉదయం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బాదేపల్లి 4వ వార్డులో ఉన్న బేడబుడగజంగాల కాలనీలో ఆ వార్డు కౌన్సిలర్​ అభ్యర్థి శంకర్​, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్​ బాదిమి శివకుమార్​తో కలిసి లక్ష్మారెడ్డి ప్రచారం చేశారు. 

బేడ బుడగ జంగాల ప్రజలంతా కారు గుర్తుకు ఓటేసి శంకర్‌‌ను గెలిపించాలని ఆయన కోరారు. ప్రస్తుతం 80 డబుల్​ బెడ్రూం ఇండ్లు కట్టిస్తున్నామని, ఓట్లలో తేడాకొట్టి టీఆర్​ఎస్​ అభ్యర్థి ఓడిపోతే ఆ ఇండ్లు ఇవ్వబోమని హెచ్చరించారు. కాలనీలో సీసీ రోడ్లు, అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ నిర్మాణాలను చేపడతామన్నారు. పట్టణంలో అభివృద్ధి జరగాలంటే టీఆర్​ఎస్​కు ఓటేయాలన్నారు. వేరే పార్టీలకు ఓటేస్తే ఒరిగేదేమీ ఉండదన్నారు. కాంగ్రెస్​, బీజేపీ అభ్యర్థులు గెలిస్తే ఏ పనులూ కావని, సమస్యల పరిష్కారం జరగదని అన్నారు. కాబట్టి ఓటర్లంతా ఆలోచించుకుని టీఆర్​ఎస్​కు ఓట్లేసి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని డిమాండ్​ చేశారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని మొత్తం 27 కౌన్సిలర్​ స్థానాలను టీఆర్​ఎస్​ పార్టీనే గెలుచుకుంటుందని లక్ష్మారెడ్డి అన్నారు. 

Tagged TRS, houses, Municipal Elections, Jadcherla, MLA Lakshmareddy

Latest Videos

Subscribe Now

More News