
బోయినిపల్లి/మల్యాల, వెలుగు: బోయినిపల్లి మండలం స్తంభంపల్లి వద్ద గంజి వాగుపై నిర్మాణం మధ్యలో ఆగిన హై లెవెల్ బ్రిడ్జిని బుధవారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఇప్పటివరకు చేసిన పనికి బిల్లు రాలేదని కాంట్రాక్టర్ చెప్పడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
బ్రిడ్జి నిర్మాణానికి మంజూరైన నిధులను పీఆర్ ఈఈని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని కేజీబీవీని పరిశీలించారు. స్కూల్‌లో రూ.8 లక్షలతో రెండు అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. అంతకుముందు మల్యాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించారు. అనంతరం ఇటీవల చనిపోయిన జడ గణేశ్, ఎమునూరీ సత్తవ్వ, సల్లూరి తిరుపతి కుటుంబాలకు రూ. 5 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.
గంగాధర, వెలుగు: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. వారిని ఆర్థికంగా భరోసా కల్పించడానికి ప్రభుత్వం ఆర్థిక పునరావాస స్కీంను ప్రవేశపెట్టిందని, ఇందులో భాగంగా గంగాధర మండలం గర్శకుర్తికి చెందిన మామిడిపల్లి విజయకు 100 శాతం సబ్సిడీతో మంజూరైన రూ.50 వేల ఆర్థికసాయాన్ని మధురానగర్‌లోని క్యాంప్ఆఫీస్లో అందజేశారు. అంతకుముందు గంగాధర మండలకేంద్రంలో నిర్వహించిన వనమహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు.