
- ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు తీసుకొచ్చిన ఎమ్మెల్యే సత్యం, భద్రాచలం ఈవో రమాదేవి
- భారీగా తరలివస్తున్న భక్తులు
కొండగట్టు, వెలుగు : జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో నిర్వహించనున్న హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. ఉదయం యాగశాలను శుద్ధి చేసిన అర్చకులు.. అనంతరం ప్రధాన ఆలయం నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి యాగశాలలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం తరఫున భద్రాచలం నుంచి వచ్చిన పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, భద్రాచలం ఈవో రమాదేవి, కొండగట్టు ఈవో శ్రీకాంత్, అర్చక బృందం ఆధ్వర్యంలో మేళతాళాలు, కళాకారుల నృత్యాల నడుమ ఆలయానికి తీసుకొచ్చారు.
అనంతరం పూజలు చేసి స్వామివారికి అలంకరించారు. మధ్యాహ్నం యాగశాలలో అఖండ దీపస్థాపన, రక్షాబంధనం, రుత్విక్‌వరణం, అరుణి మధనం. దేవతహ్వానం, అగ్ని ప్రతిష్ఠ, అభిషేకాలు చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తుల రాక పెరగడంతో స్థానిక వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఉత్సవాల సందర్భంగా చేసిన భద్రతా ఏర్పాట్లను సాయంత్రం ఎస్పీ అశోక్‌కుమార్ పరిశీలించారు.
కార్పెట్ అందజేత
ఎండ వేడి కారణంగా హనుమాన్ దీక్షాధారులు ఇబ్బందులు పడుతుండడంతో కడపకు చెందిన రాయప్ప రెడ్డి, వెంకట్ సాయినాథ్, రాజేశ్, జయంత్ కలిసి రూ. రెండున్నర లక్షల విలువైన కార్పెట్‌ను ఆలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఈవో శ్రీకాంత్ వారిని అభినందించారు.